ములకలపల్లి, అక్టోబర్ 27 : భూమి రిజిస్ట్రేషన్ కోసం ఓ రైతు నుంచి రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా పంచాయతీ పరిపాలనాధికారి(జీపీవో)ని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన ములకలపల్లిలో సోమవారం చోటు చేసుకుంది. ఏసీబీ డీఎస్పీ వై.రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. వేముకుంట గ్రామానికి చెందిన ఓ రైతు భూమి రిజిస్ట్రేషన్ కోసం భూ భారతి పోర్టల్‌లో ఈ నెల 22న స్లాట్ బుక్ చేసుకున్నాడు. అనంతరం ములకలపల్లి తహసీల్దార్ కార్యాలయంలో పూసుగూడెం జీపీవోగా విధులు నిర్వర్తిస్తున్న బానోతు శ్రీనివాస్‌నాయక్‌ను ఆ రైతు కలిసి భూమి రిజిస్ట్రేషన్ అంశాన్ని వివరించాడు.
ఇందుకోసం జీపీవో రూ.60 వేలు డిమాండ్ చేశాడు. దీనికి ఒప్పందం కుదుర్చుకున్న సదరు రైతు అదేరోజు రూ.30 వేలు ఫోన్ పే ద్వారా, రూ.10 వేలు నగదు రూపంలో అందజేశాడు. తర్వాత రూ.20 వేలు చెల్లించాలని ఒత్తిడి చేయడంతో విసుగు చెందిన రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. జీపీవో లంచం డిమాండ్ చేసిన అంశాన్ని వారికి వివరించాడు. ఏసీబీ పన్నిన పథకం ప్రకారం.. సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో జీపీవో శ్రీనివాస్‌నాయక్‌కు రైతు రూ.15 వేలు లంచం ఇస్తుండగా.. అక్కడే మాటు వేసిన ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. శ్రీనివాస్‌నాయక్‌ను అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం వరంగల్ తరలించినట్లు డీఎస్పీ రమేశ్ వివరించారు.