నేలకొండపల్లి, మే 6: తెలంగాణ ప్రభుత్వం గూడు లేని పేదల కోసం జాగను చూసి డబుల్ బెడ్ రూం ఇంటిని నిర్మించి ఇస్తోందని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆ ఇళ్లలో నివాసం ఉంటున్న పేదలందరూ సంతోషంగా ఉండాలన్నదే ప్రభుత్వ ఆశయమని అన్నారు. మండలంలోని ముటాపురం, రాజేశ్వరపురం, కట్టకొమ్ముతండా, చెన్నారం, చెరువుమాధారం, నాచేపల్లి, కట్టుకాచారం, సింగారెడ్డిపాలెం గ్రామాల్లో శనివారం పర్యటించిన ఆయన.. ఆయా గ్రామాల్లోని డబుల్ బెడ్రూం ఇళ్ల వద్దకు వెళ్లి లబ్ధిదారులకు నివాస ధ్రువీకరణ హక్కు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆయా గ్రామాల్లో సుమారు 170 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూం ఇళ్లను అందించి వారికి హక్కు పత్రాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. సొంతజాగా లేక, సరైన గూడు లేక ఏళ్ల తరబడి అద్దె ఇళ్లలో ఉంటున్న పేదలకు ప్రభుత్వం అందించిన డబుల్ బెడ్ రూం ఇళ్లు వరం లాంటివని అన్నారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు మరికంటి ధనలక్ష్మి, నాగుబండి శ్రీనివాసరావు, ఉన్నం బ్రహ్మయ్య, కోటి సైదారెడ్డి, బానోతు రాంబాయి, దండా పుల్లయ్య, ఎస్కే మస్తాన్, రాయపూడి నవీన్, ఈవూరి సుజాత, మందడి రాజేశ్, కోటి అనిత తదితరులు పాల్గొన్నారు.
ఒకప్పుడు సొంత ఇల్లు లేక అనేక అవస్థలు పడ్డాం. కేసీఆర్ ప్రభు త్వం వచ్చాక పేదలకు జాగతోపాటు డబుల్ బెడ్ రూం ఇంటిని సైతం నిర్మించి ఇస్తోంది. మాకు ఇల్లు వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. కూలి పనులు చేసుకొని జీవించే మాకు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వమే పక్కా ఇంటిని నిర్మించి ఇచ్చింది. సీఎం కేసీఆర్ రుణం తీర్చుకోలేం.
-యడవల్లి భవాని,
సింగారెడ్డిపాలెం, నేలకొండపల్లి
కూలి పనులు చేసుకొని జీవించే మాకు ఇంటిని కట్టుకోవడమంటే చాలా ఖర్చుతో కూడుకున్న విష యం.ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వమే స్థలాన్ని చూపించి అందులో డబు ల్ బెడ్ రూం ఇంటిని నిర్మించి ఇచ్చింది. మేము కన్న కలలను నిజం చేసి సొంతింటిని ఇచ్చిన మనసున్న మారాజు సీఎం కేసీఆర్. మాలాంటి పేదలకు ఎలాంటి ఖర్చూ లేకుండా అన్ని వసతులు సమకూర్చారు. మా కుటుంబానికి ఇల్లు లేదన్న రంది తీరింది.
-బట్టపోతుల అంజలి,
చెన్నారం, నేలకొండపల్లి