కోల్‌సిటీ, డిసెంబర్ 25 : సింగరేణి సంస్థకు దక్కాల్సిన నాలుగు బొగ్గు బ్లాకులను కేంద్ర ప్రభుత్వం వేలం వేయడాన్ని నిరసిస్తూ నల్లసూరీలకు అండగా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సోమవారం తలపెట్టిన నిరసన పోరు దీక్షకు రామగుండం నియోజకవర్గంలోని పద్మశాలీ కులస్తులు మద్దతుగా నిలవాలని పద్మశాలీ సేవా సంఘం ప్రధాన కార్యదర్శి ఆడెపు శంకర్ కోరారు. ఈ మేరకు ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణి సంస్థ వంద కోట్లు ఖర్చు చేసి అన్వేషణ విభాగం ద్వారా కనుగొన్న పెనుగడప, సత్తుపల్లి-3, కళ్యాణ్ ఖని, శ్రావణపల్లి బొగ్గు బ్లాకులను కేంద్ర ప్రభుత్వం టెండర్ల ద్వారా తమ బంధుగణానికి కట్టబెట్టే కుట్రలను తిప్పికొట్టే ఉద్దేశంతో ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరసన పోరు దీక్ష చేపడుతున్నారని పేర్కొన్నారు. దీనికి పద్మశాలీ కులస్తులు ఇంటికొకరు చొప్పున తరలివచ్చి విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ‘మన తెలంగాణ కోసం.. మన సింగరేణి కార్మికుల బతుకుల కోసం’ రామగుండం నుంచి మరోసారి ఉద్యమ సెగ ఢిల్లీకి తాకేలా ఎమ్మెల్యే చేపడుతున్న ఈ దీక్షకు పద్మశాలీ సంఘం తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
దీక్షకు టీఎల్పీ మద్దతు
ఫర్టిలైజర్‌సిటీ, డిసెంబర్ 25: సింగరేణి బొగ్గు బ్లాక్‌ల వేలానికి వ్యతిరేకంగా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సోమవారం ఖని చౌరస్తాలో చేపడుతున్న సింగరేణి పోరు దీక్షకు తెలంగాణ లేబర్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. స్థానిక స్ఫూర్తి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీఎల్పీ రాష్ట్ర అధ్యక్షుడు గొర్రె రమేశ్ ఈ విషయాన్ని వెల్లడించారు. తెలంగాణకు కొంగు బంగారమైన సింగరేణిని బీజేపీ ప్రభుత్వం అంబానీలకు కట్టబెట్టడానికి ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు. సింగరేణిని కాపాడుకోవడం కోసం పార్టీలకు అతీతంగా అన్ని సంఘాలు పోరు దీక్షకు మద్దతు తెలుపాలని కోరారు. నాయకులు ఏ శివరాం, జీ రమేశ్, ఏ సంజీవ్, జీఎన్ రావు, అఖిల్ వర్మ తదితరులు పాల్గొన్నారు.
విజయవంతం చేయండి
అంతర్గాం, డిసెంబర్ 25 : బొగ్గు గనుల వేలానికి నిరసనగా గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్ చేపడుతున్న సింగరేణి పోరు దీక్షను అంతర్గాం మండల ప్రజలు విజయవంతం చేయాలని జడ్పీటీసీ ఆముల నారాయ ణ, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తిరుపతి నాయక్ కోరారు. అంతర్గాం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. సింగరేణి సంస్థను కేంద్ర ప్రభుత్వం నిర్వీ ర్యం చేసేందుకు కుట్రలు పన్నుతున్నదని పేర్కొన్నారు. ‘బీజేపీ హఠావో.. సింగరేణి బచావో’ నినాదంతో అన్ని వర్గాల ప్రజలు ఎమ్మెల్యే పోరు దీక్షకు మద్దతుగా నిలిచి విజయవంతం చేయాలని కోరారు. వైస్ ఎంపీపీ మట్ట లక్ష్మి, సర్పంచ్ ధరిణి రాజేశ్, సతీశ్, కో ఆప్షన్ సభ్యుడు గౌస్‌పాషా తదితరులు పాల్గొన్నారు.