ఖమ్మం సిటీ, జూన్ 7: ‘రెక్కాడితే కానీ డొక్క నిండని నిరుపేద కార్మికులు.. వారిలో ఒంటరి మహిళలు సైతం ఉన్నారు.. రోజువారీగా మరుగుదొడ్లు శుభ్రం చేస్తున్నప్పటికీ.. వార్డుల్లో చెత్తాచెదారం లేకుం డా పరిశుభ్రంగా ఉంచుతున్నప్పటికీ.. ప్రాంగణాన్ని ఆహ్లాదకరంగా మార్చినప్పటికీ ఆకలి కేకలు తప్పడం లేదు. నిరంతరం విధులు నిర్వర్తిస్తున్నప్పటికీ నెలవారీగా వేతనాలు చెల్లించేందుకు కాంగ్రెస్ సర్కారుకు చేతులు రావడం లేదు. వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా ప్రభుత్వాసుపత్రిలో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికుల వేతన సమస్య మొదటికి వచ్చింది.
స్థానిక వైద్యాధికారుల నిర్లక్ష్యమో, గుత్తేదారుడి అలసత్వమో వెరసి ప్రస్తుత నెలతో కలిపి నాలుగు నెలలుగా బడుగు జీవులు బుక్కెడు బువ్వ కోసం రోడ్లెక్కే పరిస్థితి దాపురించింది. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. పేషెంట్ కేర్, గార్డెన్, శానిటేషన్ విభాగాల్లో పనిచేస్తున్న దాదాపు 259 మంది నెలవారీ వేతనం కోసం విధులు బహిష్కరించి ఆందోళనబాట పట్టారు. వారికి బీఆర్ఎస్, సీఐటీయూ, ఐఎఫ్టీయూ తదితర కార్మిక సంఘాలు బాసటగా నిలవడంతో ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకునేందుకు తీర్మానించుకున్నారు. అంతా కలిసి శుక్రవారం దవాఖాన ఎదుట ధర్నాకు దిగారు. కాగా.. తాజా సమస్య కేవలం గత ఏడాదిన్నరగా ఉత్పన్నం కావడం గమనార్హం.
జిల్లా సార్వజనీన ఆసుపత్రిలో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులు వేతన బకాయిలు చెల్లించాలంటూ సమ్మెకు దిగారు. దీంతో శనివారం వైద్యసేవల నిమిత్తం వచ్చిన రోగులకు పట్టపగలే చుక్కలు కనిపించాయి. దవాఖానలో అడుగుపెడితే కడుపులో పేగులు బయటికి వచ్చేంత మురుగు కంపు స్వాగతం పలుకుతోంది. ఏ మూలనచూసినా వ్యర్థాల గుట్టలు దర్శనమిస్తున్నాయి. కనీసం మంచినీళ్లు కూడా దొరకని దుస్థితి నెలకొంది. వృద్ధులు, నడవలేని వారిని, ప్రసవం కోసం వచ్చే గర్భిణులను కనీసం స్ట్రెచర్‌తో లోపలికి తీసుకెళ్లే వారే కరువయ్యారు. రోగుల సహాయకులుగా వస్తున్న వారి కుటుంబ సభ్యులే భుజాలపై మోసుకెళ్తున్న ఘటనలు హృదయ విదారకంగా దర్శనమిస్తున్నాయి.
ఈ విషయంపై కాంగ్రెస్ సర్కారుకు చెందిన మంత్రులు, పెద్దలు పట్టించుకున్న పాపానపోవడం లేదు. స్థానిక గుత్తేదారు, వైద్యాధికారులు మీనమేషాలు లెక్కిస్తూ కూర్చుంటున్నరు. సమస్యను పరిష్కరించాల్సిన అధికారులు రోజుకు రూ.వెయ్యి చెల్లించి ప్రైవేటు వ్యక్తులను తీసుకొచ్చి పారిశుధ్య పనులకు పురమాయించారు. కానీ.. బాత్రూములు, కుప్పలుగా పేరుకుపోయిన వ్యర్థాలు కుళ్లిన వాసన వస్తుండటంతో వారు కూడా తూతూమంత్రంగా తంతు ముగించారు.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత ఖమ్మం జిల్లా ప్రభుత్వాసుపత్రిలో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్న కార్మికులు ఆందోళనకు దిగడం ఇదే మొదటిసారి కాదు. కేవలం నెలవారీ వేతనాలు చెల్లించండి మహాప్రభో అంటూ రోడ్డెక్కడం ఏడవ దఫా. గత మే నెలలో సైతం వారంతా ధర్నాకు దిగితే కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ జోక్యం చేసుకున్నారు. నాడు రాష్ట్ర డిఫ్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మంలో పర్యటిస్తున్న నేపథ్యంలో ఎలాగైనా సమ్మె విరమించేలా చూడాలని సంబంధిత వైద్యాధికారులను ఆదేశించారు.
తక్షణమే రంగంలోకి దిగిన యంత్రాంగం జిల్లా పరువు తీయవద్దని కార్మికులను బతిమాలుకున్నారు. తక్షణమే ఒక నెల వేతనం చెల్లించి, మిగతావి ఇరవై రోజుల్లో వచ్చేలా చూస్తామని నమ్మబలికారు. వారు అనుకున్న లక్ష్యం నెరవేరి అధికారిక కార్యక్రమం ముగిసిన తర్వాత ఇప్పుడేమో తమకేమీ సంబంధం లేనట్లుగా చేతులెత్తేశారు. దీంతో ఆగ్రహించిన వేతనజీవులు గత్యంతరం లేని పరిస్థితుల్లో మరోమారు సమ్మెకు పిలుపునిచ్చారు. ‘మార్పు’ అంటూ అనేక వాగ్ధానాలు చేసిన కాంగ్రెస్ పెద్దలకు తమ వేతన సమస్య ఏమాత్రం పట్టింపులేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లా ప్రభుత్వాసుపత్రికి ఉమ్మడి ఖమ్మంతోపాటు కోదాడ, మహబూబాబాద్, కృష్ణా జిల్లాలకు చెందిన రోగులు రోజుకు దాదాపు రెండువేల మంది వరకు వైద్యసేవల నిమిత్తం వస్తుంటారు. వారితోపాటు మరో వెయ్యి మంది వరకు రోగుల సహాయకులు సైతం ఉంటారు. వారందరికీ పారిశుధ్యం, వార్డుల్లో, రకరకాల విభాగాల్లో ఎలాంటి అసౌకర్యం కలుకుండా చూసేది కేవలం కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులు మాత్రమే. వారందరికీ బీఆర్ఎస్ హయాంలో నెలవారీగా లేదా రెండు నెలలకు ఒకసారైనా పూర్తి స్థాయిలో వేతనాలు అందేవి.
కానీ.. అత్యవసరమైన వైద్యరంగంపై జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ముగ్గురు మంత్రులకు ఏమాత్రం పట్టింపు లేనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్థానికంగా నెలకొంటున్న వేతన సమస్య గురించి ఏడాదిన్నర పాలనలో ఒక్కరోజు కూడా సమీక్ష నిర్వహించకపోవడం విస్తుగొలుపుతోంది. దీంతో పెద్దాసుపత్రి కార్మికులు తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు వినికిడి. అంతా కలిసి హైదరాబాద్‌లోని డీఎంఈ కార్యాలయాన్ని ముట్టించాలని తీర్మానించుకున్నట్లు తెలుస్తోంది. దీనికిగాను కార్మిక సంఘాలు సైతం సంపూర్ణ మద్దతు తెలపడం విశేషం.