మయూరిసెంటర్, జూన్ 26 : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ ఆర్టీసీ)లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ కార్మికులు అర్ధాకలితో అలమటిస్తున్నారు. వేతనాలు సమయానికి అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ బాధని మరొకరితో పంచుకుందామంటే కూడా అవకాశం లేకుండాపోయింది. ఔట్సోర్సింగ్ ఏజెన్సీకి తెలిస్తే తమ ఉద్యోగం కాస్త ఎక్కడ ఊడిపోతుందేమోనని మనోవేదన చెందుతున్నారు. నెలంతా శ్రమించి పిల్లలకు పట్టెడన్నం పెట్టలేని దుస్థితిని అనుభవిస్తున్నారు. కడుపు మాడ్చుకొని మరీ అదనపు విధులు నిర్వహిస్తున్న ఔట్సోర్సింగ్ కార్మికుల సమస్యలను ఆర్టీసీ ఉన్నతాధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా ఖమ్మం రీజియన్ పరిధిలోని ఏడు డిపోల్లో 748 మంది కార్మికులు వివిధ స్థాయిల్లో పనిచేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పరిధిలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న ఖమ్మం రీజియన్‌లోని ఏడు డిపోల్లో ఔట్సోర్సింగ్ కార్మికులకు ఒక్కో డిపోలో ఒక్కో రీతిన వేతనాలు చెల్లిస్తున్నారు. ప్రధానంగా ఖమ్మం డిపోలో కార్మికుల దుస్థితిని పట్టించుకునే నాధుడే లేడు. ఈ నెల విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో తల్లిదండ్రులపై అదనపు భారం ఉంటుంది. అయితే తమ వేతనాలు ఎప్పుడు వస్తాయో తెలియని ఆ కార్మికులు ఎంతో వేదనతో అప్పులు చేయాల్సిన దుస్థితి దాపురించింది. కుటుంబ పోషణకు ఒళ్లు హూనం చేసుకుంటే తప్ప రోజుగడిసే పరిస్థితి లేదు. నెల వేతనం కావాలని అధికారులను వేడుకుంటే చిన్నచూపుతో ఛీత్కారాలు ఎదుర్కోవాల్సిన స్థితిలో కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు.
కార్మికుల శ్రమను ఔట్సోర్సింగ్ ఏజెన్సీతోపాటు కొందరు అధికారులు వాటాలుగా పంచుకుంటున్నారు. డ్రైవర్లకు నెలకు రూ.24,500 వేతనం ప్రభుత్వం ఇస్తుండగా.. ఖమ్మంలో మాత్రం ఔట్సోర్సింగ్ ఏజెన్సీ రూ.23,000 చెప్పి కార్మికుడి చేతికి రూ.22,000 మాత్రమే ఇస్తున్నారు. దీంతో రూ.2,500లను వాటాలు పంచుకుంటున్నారు. ఆ రూ.22,000 వేతనం కూడా నెలలో నాలుగు లేదా ఐదు దఫాలుగా చెల్లిస్తున్నారు. ఒక్కసారే చెల్లించాల్సిన వేతనాలు ఇలా ఎందుకు చెల్లిస్తున్నారని ప్రశ్నిస్తే.. మరో నెలలో డ్యూటీ ఇవ్వకుండా వేధిస్తున్నారని కార్మికులు కంటతడి పెడుతున్నారు. మిగిలిన ఆరు డిపోల్లో మాత్రం వేతనాలు ప్రతినెలా 15వ తేదీలోగానే చెల్లిస్తున్నారు. అదేవిధంగా రూ.23,019 వేతనం చెల్లించడం గమనార్హం.
ఖమ్మం రీజియన్ పరిధిలోని 7 డిపోల్లో ఔట్సోర్సింగ్ పద్ధతిలో కార్మికులు వివిధ స్థాయిల్లో పని చేస్తున్నారు. వారిలో డ్రైవర్లు-238, కండక్టర్లు-58, బస్సు క్లీన్ చేసేవారు-69, బస్టాండ్ క్లీన్ చేసేవారు-54, సహాయ మెకానిక్‌లు-46, కార్గో సిబ్బంది-37, మరుగుదొడ్ల నిర్వాహకులు-28, సెక్యూరిటీ-29, క్యాంటిన్ నిర్వాహకులు-37, పారామెడికల్ సిబ్బంది-20, గ్యారేజీ క్లీనర్స్-24తో వివిధ స్థాయిల్లో స్కిల్డ్, అన్‌స్కిల్డ్ కార్మికులు-108 మంది కలిపి మొత్తం 748 మంది కార్మికులు చేస్తున్నారు. వీరి వేతనాలు పూర్తిగా ఔట్సోర్సింగ్ పద్ధతిలో ఏజెన్సీలకు ఆర్టీసీ సంస్థ చెల్లిస్తే వారి వద్ద నుంచి కార్మికులకు చెల్లించాల్సి ఉంటుంది. కానీ, ఔట్సోర్సింగ్ ఏజెన్సీలు మాత్రం తమ ఇష్టారాజ్యంగా కార్మికులను శ్రమదోపిడీకి గురిచేస్తూ జేబులు నింపుకుంటున్నాయి. అయితే న్యాయబద్ధంగా రావాల్సిన వేతనాలు తమకు దక్కేలా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ ఉన్నతాధికారులను కార్మికులు వేడుకుంటున్నారు. ఎన్నికల సమయంలో ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు.
టీజీఎస్ ఆర్టీసీలో ఔట్సోర్సింగ్ ద్వారా కార్మికులుగా పనిచేస్తున్న వారికి వారితో చేసుకున్న ఒప్పందం ప్రకారమే వేతనాలు చెల్లిస్తున్నాం. కార్మికుల వేతనాలను ప్రతినెలా సక్రమంగానే అందజేస్తున్నాం. ఎవరికీ ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేయడం లేదు. ఆర్టీసీ సంస్థ నిధుల విడుదల ఆధారంగా సమయానికే వేతనాలు పంపిణీ చేస్తున్నాం.
– అజయ్‌కుమార్, ఔట్సోర్సింగ్ ఏజెన్సీ నిర్వాహకుడు