ఖమ్మం సిటీ, జూన్ 6 : నాలుగు నెలల వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ కార్మికులు విధులు బహిష్కరించి ఖమ్మం జిల్లా ప్రభుత్వాసుపత్రి ఎదుట శుక్రవారం ధర్నా చేపట్టారు. దీంతో పేషెంట్ కేర్, సెక్యూరిటీ, గార్డెన్, పారిశుధ్య విభాగాల్లో కలిపి మొత్తం 259 మంది ఆందోళనకు దిగడంతో వార్డుల్లో సేవలు పూర్తిగా స్తంభించిపోయాయి. వ్యర్థాలు పేరుకుపోయి రోగులకు కంపు కొట్టడంతోపాటు కనీసం మంచినీటి వసతి కూడా లభించని దుర్భర పరిస్థితి నెలకొంది.
ఉదయం 11 గంటలు దాటినప్పటికీ కార్డియాలజీ, ఎక్స్రే, ల్యాబ్, ఫార్మా, ఓపీ తదితర గదుల తాళాలు తీయలేదు. ఆందోళనకు దిగిన కార్మికులకు బీఆర్ఎస్, సీఐటీయూ, ఐఎఫ్టీయూ తదితర కార్మిక సంఘాలు బాసటగా నిలిచాయి. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ గత నెలలో సమ్మెకు దిగిన వెంటనే జిల్లాలో మంత్రుల పర్యటన ఉందని చెప్పి ఒక నెల వేతనం చెల్లించారన్నారు.
మిగిలిన మూడు నెలల వేతనాలు 20 రోజుల్లో ఇస్తామని బుకాయించి, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబ్బులు రావడం లేదని వైద్యాధికారులు చేతులెత్తేస్తున్నారని వాపోయారు. జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ కార్మికుల సమస్యను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. వేతనాల కోసం ఈ నెల 9న హైదరాబాద్ వెళ్లి డీఎంఈ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.