ఖమ్మం సిటీ, జూన్ 10: వేతనాల కోసం వరుస ఆందోళనలు చేసి విసిగిపోయిన కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ కార్మికులు మంగళవారం ఖమ్మం పెద్దాసుపత్రి నుంచి రాజధాని బాటపట్టారు. రెండు బస్సులు, రెండు తుఫాన్ వాహనాలు, రెండు కార్లలో సుమారు 200 మంది హైదరాబాద్‌లోని డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) అధికారి కార్యాలయానికి వెళ్లి అక్కడ ఆందోళనకు దిగారు. సీఐటీయూ, టీయూసీఐ రాష్ట్ర, జిల్లా నేతల సహకారంతో కార్మికులు నినాదాలతో హోరెత్తించారు. తమ ఆకలి కేకలకు పరిష్కారం చూపించాలని, జిల్లా స్థాయిలో తమకు జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకోవాలని వేడుకున్నారు. దీంతో ఆయా సంఘాల కీలక కార్మికులను డీఎంఈ తన గదిలోకి పిలిపించుకుని చర్చలు జరిపారు.
బుధవారం మధ్యాహ్నం వరకు కార్మికుల ఖాతాల్లోకి రెండు నెలల వేతనం జమ చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో గతంలో మాదిరిగానే 575 బెడ్స్‌కు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుని ప్రతి నెలా వేతనం అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్మికులు తక్షణమే విధుల్లోకి వెళ్లాలని, రోగులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
అయితే ఖాతాల్లోకి నగదు జమ అయిన తర్వాతే కార్మికులు విధుల్లోకి వెళతారని సంబంధిత సంఘాల ప్రతినిధులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇచ్చిన మాటను విస్మరిస్తే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ, టీయూసీఐ రాష్ట్ర, జిల్లా నాయకులు సుధాకర్, విష్ణువర్దన్‌రెడ్డి, అవినాష్, జీ రామయ్య, కొయ్యల శ్రీనివాస్, దవాఖాన వర్కర్స్ నాయకులు అంబేద్కర్, జగదీశ్, అశోక్, మాతంగి అనిల్, హరీశ్, వెంకటేశ్వర్లు, సైదులు, ఉపేందర్, వెంకటరమణ, విజయమ్మ తదితరులు పాల్గొన్నారు.