ఉమ్మడి పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను చిన్నచూపు చూసింది. ఉచిత కరెంటని చెప్పి రైతులను ముప్పు తిప్పలు పెట్టింది. రోజంతా పడిగాపుల పాలు చేసింది.. కరెంట్ షాక్‌లు, పాము కాట్లతో రైతులు ప్రాణాలు వదిలేలా చేసింది.. ఒక్కరోజైనా ఏకధాటిన ఏడు గంటల కరెంట్ సరఫరా కాలేదంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. సాగునీరు అందకపోవడంతో డీజిల్ మోటర్లను ఆశ్రయించి కొందరు రైతులు అప్పుల పాలయ్యారు. అట్ల రైతులను గోస పెట్టిన కాంగ్రెసోళ్లు ఇప్పుడు రైతులపై కపట ప్రేమ చూపిస్తున్నరు.. మొసలి కన్నీరు కారుస్తున్నరు. రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ, పంటలకు 24 గంటలకు ఉచిత కరెంట్ వంటి మంచి పథకాలు ఇస్తున్న బీఆర్ఎస్పై నోరు పారేసుకుంటున్నరు. అంతేనా.. 10 హెచ్‌పీ మోటర్లు బిగించుకుంటే పంటలకు కేవలం మూడు గంటల కరెంట్ ఇస్తే చాలునని జ్ఞానం లేకుండా ప్రకటిస్తున్నరు. ఈ పరిణామాలపై రైతులు, విశ్రాంత రెవెన్యూ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నరు. ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గోరి కడుతమని స్పష్టం చేస్తున్నరు.
ఖమ్మం, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి రాష్ట్రంలో రైతులు పంటలు పండించుకోవడానికి తీరొక్క ఇబ్బందులు పడ్డారు. పంట వేసింది మొదలు చేతికొచ్చే వరకు తంటాలు పడేవారు. వరి నాటు వేసినప్పటి నుంచి నీటి తడులు పెట్టేందుకు ముప్పు తిప్పలు పడేవారు. విద్యుత్ సరిగా రాకపోవడం.. వచ్చినా లో వోల్టేజీ సమస్యతో మోటర్లు కాలిపోవడం.. అధిక లోడ్‌తో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం.. వాటిని బాగు చేయించుకోవడానికి ఆయకట్టు రైతులందరూ చందాలు వేసుకోవడం నిత్యకృత్యమయ్యేది. ఒక దశలో కళ్లముందు పంట ఎండిపోతుంటే దిగులు చెందుతూ కన్నీరు పెట్టుకునేవారు. పంట కోసం చేసిన అప్పులు ఎలా తీర్చేది అంటూ మదనపడేవారు. చేసేది లేక సాగు భూమిని అమ్ముకున్న సందర్భాలున్నాయి. కొన్నిచోట్ల పంటలను సాగు చేయకపోవడంతో బీడు భూములుగా మారాయి. కానీ.. సీఎం కేసీఆర్ పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల పక్షాన నిలిచి వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చింది.
రైతుగా ఉన్న నాయకుడు సీఎం కావడంతో వ్యవసాయ రంగానికి నూతన ఒరవడి ఇచ్చినైట్లెంది. రైతుల పంటలకు ఎటువంటి లోటు రాకూడదనే ఉద్దేశంతో 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీంతో కరెంట్ కోతలకు చెక్‌పడింది. రైతులకు పంట పెట్టుబడి సాయం ప్రభుత్వమే అందిస్తుండడంతో రైతులు రెండు పంటలు పండించుకుంటున్నారు. అయితే ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు రైతులకు 24 గంటల విద్యుత్ అవసరం లేదని, 3 గంటలు చాలని సభలు, సమావేశాల్లో పదే పదే వల్లించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయం గురించి తెలియని వారు అలాంటి మాటలు మాట్లాడుతారని, మూడు గంటల విద్యుత్‌తో మూడు రోజులైనా ఒక్క మడి కూడా తడవదని చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ వస్తే కారు చీకట్లలోనే గడపాల్సి వస్తుందని, పంట భూములన్నీ బీడు భూములయ్యే ప్రమాదం ఉందని అంటున్నారు.
నేను 15 ఏళ్లుగా టీవీ మెకానిక్‌గా పని చేస్తున్నా. 24 గంటల కరెంటు మా ఊళ్లోఎప్పుడూ చూడలేదు. ఉదయం ఉంటే సాయంత్రం కరెంటు ఉండేది కాదు. కరెంటు సమస్య వల్ల కాలిపోయిన టీవీలు తరచూ రిపేరుకు వస్తూ ఉండేవి. టీవీ రిపేరు చేయాలన్నా కరెంటు లేక ఖాళీగా ఉండే వాళ్లం. దీంతో ఏ పనీ లేక నాకు వృత్తి రాకపోయినా కార్పెంటర్ పనికి కూలికి వెళ్ల్లి వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషించుకునే వాడిని. తెలంగాణ వచ్చాక కరెంటుకు ఏ ఇబ్బందీ లేదు. అప్పటివరకూ నేను 24 గంటల కరెంటు చూడలేదు. నిత్యం కరెంటు ఉండడంతో పనికి వెళ్లకుండా నా షాపులోనే ఉంటూ టీవీ రిపేర్లు చేసుకుంపటన్నా. గృహావసరాలకే కాక వ్యవసాయానికి కూడా 24 గంటలు కరెంటు ఇస్తుండడంతో రైతులూ ఆనందంగా ఉన్నారు.
వ్యవసాయాన్నే నమ్ముకున్న రైతులు గతంలో నాట్లు వేసి దేవుడా నీవే దిక్కు అంటూ ఆకాశం వైపు చూడడం తప్ప చేసేదేమీ లేదు. అరకొర విద్యుత్ వస్తున్నప్పటికీ మోటర్లన్నీ ఒక్కసారిగా స్విచ్ ఆన్ చేయడంతో కొన్ని మోటర్లు కాలిపోవడం, కొన్ని ఇబ్బంది పెట్టడం ఇబ్బందిగా మారేది. వర్షాలు కురిస్తే పంటలు పండుతాయి.. లేకపోతే వదిలేద్దామనే పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ ఒక్క ఎకరం కూడా ఇంత వరకు ఎండిపోయిన దాఖలాలు లేవు. తెలంగాణ వస్తే ఇంత ఉపయోగం ఉంటుందనేది నేడు రైతులకు కళ్లారా కనిపిస్తుంది. సీఎం కేసీఆర్ 24 గంటల విద్యుత్ ఇవ్వడం వల్ల రెండు పంటలు పండుతున్నాయి.
ఉమ్మడి పాలనలో విద్యుత్ మోటర్ల వద్ద కాపలా ఉండేందుకు రైతులు రేయింబవళ్లు కష్టపడ్డారు. పొలాలకు నీళ్లు పెట్టేందుకు వెళ్లే క్రమంలో పాములను కళ్లారా చూస్తూ బిక్కుబిక్కుమంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. ఎకరం నీళ్లు పెట్టాలంటే దాదాపు మూడు రోజులు రేయింబవళ్లు కష్టపడితేనే నీళ్లు పట్టేది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ పొలాలకు 24 గంటలు కరెంట్ ఇవ్వడంతో సమృద్ధిగా నీటిని అందించగలుగుతున్నాం. ఆనాడు కష్టాన్ని చూశాం.. ఈనాడు సౌలభ్యాన్ని చూస్తున్నాం.
సీఎం కేసీఆర్ పుణ్యాన ఇప్పుడు రైతులకు పుష్కలంగా కరెంట్ అందుతున్నది. భూమి తగాదాలు పూర్తిగా తగ్గిపోయాయి. ఎప్పుడు స్టార్టర్ ఒత్తితే అప్పుడు మోటర్లు నీళ్లు పోస్తున్నాయి. 24 గంటల కరెంట్ రావడం వల్ల ఎవరు ఎప్పుడు వీలుపడితే అప్పుడు మోటర్లు ఆన్ చేస్తున్నారు. ట్రాన్స్ఫార్మర్లు, మోటర్లు కాలిపోవడం లేదు. ఈ పద్ధతిని తీసివేసి మూడు గంటల కరెంట్ అనడం సరికాదు. 10హెచ్‌పీ మోటర్లు అందరూ పెడితే ఒక్కసారి ఆన్‌చేస్తే ఒక్క ట్రాన్స్ఫార్మర్ కూడా మిగలదు. కాంగ్రెస్ నాయకుల మాటలు వింటుంటే రైతులను ఆగం చేసేందుకు కుట్రలు పన్నుతున్నట్లు ఉంది. రైతుల అవసరాలకు తగిన రీతిలో బీఆర్ఎస్ పాలన ఉంటే.. కాంగ్రెస్ ఏదో కిరికిరి పెట్టాలని చూస్తుంది. వాళ్ల మాటలను ఏ ఒక్కరూ నమ్మే పరిస్థితిలో లేదు.
కాంగ్రెస్ నాయకులు అవగాహన రాహిత్యంగా మాట్లాడుతున్నారు. పొలాలకు 10హెచ్‌పీ విద్యుత్ మోటర్లు బిగిస్తే బోర్లు ఎండిపోతాయి. కాంగ్రెస్ నాయకులకు వ్యవసాయంలో బాధలు తెలియవు. 10హెచ్‌సీ మోటర్లతో లోడ్ పడి ట్రాన్స్ఫార్మర్పై పేలిపోయే ప్రమాదం ఉంది. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న 24 గంటల కరెంట్‌తో రైతులందరం సంతోషంగా వ్యవసాయం సాగు చేసుకుంటున్నాం. మూడు గంటలు కరెంట్ వ్యవసాయానికి ఏ మూలకూ సరిపోదు. కనీసం మడి కూడా తడవదు.
24 గంటల విద్యుత్ నిరంతరాయంగా ఇవ్వడం వల్ల వ్యవసాయ రంగం మరింత అభివృద్ధి చెందింది. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల కష్టసుఖాలు తెలుసుకున్న మహానుభావుడు. రైతుల పంటలు దెబ్బతినకుండా 24 గంటలు విద్యుత్ ఇవ్వడం ద్వారా రైతును రాజును చేసినైట్లెంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మూడు గంటలు విద్యుత్ సరిపోతుందన్న రేవంత్‌రెడ్డి మాటలు విని తెలంగాణ ప్రజలు ఆగం కావొద్దు. కేసీఆర్‌తోనే రైతు సంక్షేమ రాజ్యం ఏర్పడుతుంది. కాంగ్రెస్ మాటలు నమ్మి రైతులు మోసపోవద్దు. రైతులందరూ బీఆర్ఎస్ పక్షానే నిలబడాలి.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు 24 గంటల విద్యుత్ ఇస్తుండడంతో వ్యవసాయం పండుగలా మారింది. నిరంతర విద్యుత్ సరఫరా కావడంతో నాకున్న పదెకరాల వరి పొలం, పదెకరాల పామాయిల్ తోటలో బోర్ల ద్వారా ఏ రందీ లేకుండా రెండు పంటలు పండించుకుంటున్నా. కాంగ్రెస్ వస్తే మళ్లీ పాతరోజులే వస్తాయి. అలాంటి చీకటి రోజులు రావద్దు. మళ్లీ కేసీఆరే రావాలి. కేసీఆర్ అధికారంలోకి వస్తే రైతుకు కొండంత అండ.
నాకు మూడెకరాల పొలం ఉంది. నిరంతరాయంగా కరెంటు సరఫరా అవుతుండడంతో రెండు పంటలు పుష్కలంగా పండుతున్నాయి.సీఎం కేసీఆర్ 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తుండడంతో ఉత్సాహంగా రెండు పంటలు పండించుకుంటున్నాం. మరోపక్క పంట పెట్టుబడి సాయం కూడా చేతికందడంతో వ్యవసాయం పండుగలా ఉంది. కాంగ్రెసోళ్లు వస్తే కరెంటు ఉంటుందో.. ఉండదో నమ్మకం లేదు.
కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కరెంట్ కష్టాలు మళ్లొస్తాయి. గతంలో రాత్రి కరెంట్‌లో అనేక ఇక్కట్లు పడ్డాం. మళ్లీ ఆ బాధలు మాకొద్దు. కాంగ్రెస్ వాళ్లు మూడు గంటలు కరెంట్ సరిపోతుందంటున్నారు. అలా అయితే మా పొలాలు, తోటలకు నీరు సరిపోదు. గతంలో ఇలాంటి ఇబ్బందులు చాలా పడ్డాం. మాకున్న భూమిలో కూరగాయల తోట వేసుకున్నాం. కరెంట్ కోతలు ఉంటే ఏ పంట పండించుకోలేం. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న కరెంట్ చాలా బాగుంది. కోతల్లేని కరెంట్‌తో పంటలు బాగా పండుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సాగుకు ఎలాంటి ఇబ్బందులు లేవు.
అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ అందుతుండడంతో వ్యాపారం సజావుగా సాగుతున్నది. గతంలో పాన్ షాపులో కుర్చుంటే ఎప్పుడు కరెంట్ వస్తుందో తెలియక అసహనానికి గురయ్యేవాడిని. ఇప్పుడు ఆ రంది లేదు. ఇదంతా సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఘనత. వ్యాపారులకే కాకుండా రైతులకు ఎంతో మేలు జరుగుతోంది. నిరంతర విద్యుత్ అందించడంలో యావత్ దేశానికే తెలంగాణే రోల్ మోడల్‌గా ఉంటుంది. కోతలు లేకుండా విద్యుత్ అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చీకటి కష్టాలను కళ్లారా చూశాం. విద్యుత్ వస్తూ.. పోతుండడంతో మోటర్లు ఇబ్బందులు పెట్టేవి. రాత్రింబవళ్లు వరి పైరు పండించుకునేందుకు వంతులవారీగా పొలాల్లో జాగారాలు చేశాం. ఏటా మోటర్ల మరమ్మతు కోసమే తిరగాల్సి వచ్చేది. అన్ని కష్టాలుపడ్డ రైతులు నేడు తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ దయవల్ల నిరంతర విద్యుత్ రావడం వల్ల రైతులు బాధలు తీరాయి. కరెంట్ ఉంటే వేసిన పంటను ఎంత ఇబ్బంది పడైనా కాపాడుకునే ధైర్యం వచ్చింది. ఎవరెన్ని చెప్పినా విద్యుత్ అందించడంలో కేసీఆర్‌యే మొనగాడు. ఇది యావత్ సమాజం ఒప్పుకొని తీరాల్సిందే.