– టీజీ జేఏసీ, టీఎస్‌యూటీఎఫ్ నాయకుల డిమాండ్
ఎర్రుపాలెం, సెప్టెంబర్ 01 : పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు మంగళవారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మండలంలోని వివిధ పాఠశాలల్లో, ఎండీఓ కార్యాలయం ఎదుట భోజన విరామ సమయంలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, పెండింగ్‌లో ఉన్న డీఏలను విడుదల చేయాలని, పీఆర్సీని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా నాయకులు డిమాండ్ చేశారు. టీఎస్‌యూటీఎఫ్ ఖమ్మం జిల్లా కార్యదర్శి అనుమోలు కోటేశ్వరరావు, ఎర్రుపాలెం మండల అధ్యక్షుడు కంచర్ల శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి నండ్రు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. సీపీఎస్ విధానం ఉద్యోగుల పదవీ విరమణ అనంతర ఆర్థిక భద్రతపై ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పీఆర్సీ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని నాయకులు కోరారు.
పీఆర్సీ ప్రక్రియను ప్రారంభించి వేతన సవరణపై నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే పెండింగ్‌లో ఉన్న డీఏలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. డీఏల చెల్లింపులో జాప్యం వల్ల ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
సీపీఎస్ రద్దు, పీఆర్సీ ఏర్పాటు, పెండింగ్ డీఏల విడుదల తదితర అంశాలపై ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని నాయకులు కోరారు. సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం నుంచి స్పందన రాకపోతే ఈ నెల 10న హైదరాబాద్‌లో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేపట్టనున్నట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎండీఓ కార్యాలయ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, ఎండీఓ, ఎమ్మార్వో కార్యాలయాల ఉద్యోగులు, టీఎస్‌యూటీఎఫ్ నాయకులు టి.రత్తమ్మ, నీలం సైదారావు, సతీష్, జీవన్, కాజా నాగేశ్వరరావు, రవికుమార్, సత్యనారాయణ, నాగరాజు, పి.డి. సాంబశివరెడ్డి, ఎస్.వెంకమ్మ, పుల్లయ్య, రత్నకుమారి, డి.రమేష్, టి.వెంకటకృష్ణ, ఎం.శ్రీనివాస్, పుల్లారావుతో పాటు వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినులు పాల్గొన్నారు.