ఖమ్మం ఎడ్యుకేషన్, జూలై 27 : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్జీటీలుగా పనిచేస్తున్న ఉపాధ్యాయుల్లో మరో 75 మంది స్కూల్ అసిస్టెంట్లుగా ఉద్యోగోన్నతులు పొందనున్నారు. గత నెలలో జరిగిన ఉద్యోగోన్నతుల ప్రక్రియలో కొందరు ఉపాధ్యాయులు పదోన్నతులను వదులుకోగా.. మరికొందరికి రెండు సబ్జెక్ట్లలో అవకాశం వచ్చింది.
అయితే పదోన్నతి పొంది రిపోర్ట్ చేయని ఖాళీలను గుర్తించిన విద్యాశాఖాధికారులు వీటిని పదోన్నతుల ద్వారా భర్తీ చేస్తున్నారు. ఇందులో భాగంగా 75 మంది ఎస్జీటీల సీనియార్టీ ఆధారంగా ఖాళీల జాబితాను శనివారం విడుదల చేశారు. ఆదివారం వెబ్ ఆప్షన్స్ ద్వారా పాఠశాలలను ఎంపిక చేసుకునే అవకాశం కల్పించనున్నారు. ఒకటి రెండు రోజుల్లో పదోన్నతులు పొందిన వారికి డీఈవో సోమశేఖర శర్మ ఉత్తర్వులు జారీ చేయనున్నారు.
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయుల్లో 700 మంది టీచర్లు శనివారం సెలవు పెట్టారు. జిల్లావ్యాప్తంగా అన్ని కేటగిరీల్లో 4,726 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. అయితే శనివారం ఒక్కరోజే ఇంత మంది సెలవులో ఉండడం పట్ల డీఈవో సోమశేఖర శర్మ నుంచి వివరణ కోరడంతోపాటు ట్రైనీ కలెక్టర్ మిర్నల్ శ్రేష్ట కలెక్టర్కు నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల కలెక్టర్.. హెచ్ఎంల సమీక్షలో ప్రతిరోజు విద్యార్థులతోపాటు ఉపాధ్యాయుల హాజరు వివరాలు తెలుసుకుంటానని స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో ట్రైనీ కలెక్టర్ విద్యార్థుల, ఉపాధ్యాయుల హాజరుతోపాటు బోధనపై దృష్టి పెట్టారు. ఇటీవల కల్లూరు మండలంలో ఒకేరోజు 30 మంది ఉపాధ్యాయులు సెలవు పెట్టిన అంశంపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ప్రభుత్వ పాఠశాలల్లో బోధనకు ఉపాధ్యాయులు లేరనే అంశంపై విద్యాశాఖ డిప్యూటేషన్లు కేటాయిస్తుండగా.. బోధనను మరిచి రోజూ వందల మంది ఉపాధ్యాయులు సెలవులో ఉంటే పరిస్థితి ఏమిటని డీఈవోను ప్రశ్నించడంతోపాటు క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.