బోనకల్లు, ఏప్రిల్ 01 : దేశంలో మావోయిస్టుల నిర్మూలనకు కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్ ను కేంద్రం వెంటనే నిలిపేయాలని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసి ఖమ్మం జిల్లా నాయకుడు ఎం.గిరి అన్నారు. కేంద్రం చర్యను నిరసిస్తూ ఈ నెల 8న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద చేపట్టే ధర్నాను విజయవంతం చేయాలని కోరుతూ మంగళవారం బోనకల్లులో వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గిరి మాట్లాడుతూ… 2024 నుండి ఛత్తీస్గఢ్ రాష్ట్రం దండకారణ్యం అటవీ ప్రాంతాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఆదివాసీలపై హింస, దౌర్జన్యకాండకు పాల్పడుతున్నట్లు తెలిపారు. ఆదివాసులను ఎన్కౌంటర్ల పేరుతో హత్యలు చేయడం నిత్యకృత్యంగా మారిందన్నారు.
మైనింగ్ కంపెనీలను సంతోషపెట్టడానికి కేంద్రం ఆపరేషన్ కగార్ తీసుకొచ్చిందని దుయ్యబట్టారు. అడవి ప్రాంతాల్లో రెండు కిలోమీటర్లకు ఒక బేస్ కంపెనీ ఏర్పాటు చేసి వేలాది మంది సైనిక బలగాలతో నిత్యం దాడులు చేస్తుందన్నారు. మావోయిస్టులను నిర్మూలించే పేరుతో ఆదివాసి సమూహాన్ని నిర్మూలించే కుట్రలకు ప్రభుత్వాలు పాల్పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైరా సబ్ డివిజన్ కార్యదర్శి ఎస్కే కాసీం, వి.వి.రావు, విజయ్, నవీన్, భాష పాల్గొన్నారు.