గుండాల, మే 30 : ఏజెన్సీ ప్రాంతంలోని విలువైన ఖనిజ సంపదను కార్పొరేట్ సంస్థల యజమానులు అంబానీ, అదానీలకు కట్టబెట్టేందుకు.. అమాయకులైన ఆదివాసీలను అడవుల నుంచి తరిమేయడానికే కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ కగార్’ పేరిట మానవ దహనానికి పూనుకున్నదని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క ఆరోపించారు. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ గుండాల మండల కేంద్రంలో రైతుకూలీ సంఘం(ఆర్సీఎస్), అఖిల భారత రైతుకూలీ సంఘం(ఏఐకేఎంఎస్), ఆలిండియా ఖేత్ మజ్దూర్-కిసాన్ సభ, తుడుందెబ్బ ఆధ్వర్యంలో శుక్రవారం ర్యాలీ నిర్వహించారు.
తొలుత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విమలక్క మాట్లాడుతూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా 2026 మే నెల వరకు మావోయిస్టులను తుదముట్టిస్తామని రాజ్యాంగ విరుద్ధమైన వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. మావోయిస్టులు స్వచ్ఛంద కాల్పులు విరమణ ప్రకటించినా.. దానిని స్వాగతించకుండా కేంద్ర ప్రభుత్వం వేలాదిగా సైనిక బలగాలను అడవుల్లోకి దింపి మావోయిస్టు నేతలతోపాటు అమాయక ఆదివాసీలను కాల్చి చంపుతూ ఎన్కౌంటర్ల పేర మానవ దహనం కొనసాగిస్తోందన్నారు. తర్వాత వారి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించకుండా ప్రభుత్వమే దహనం చేయడం అప్రజాస్వామికమన్నారు.
ఇటీవల మావోయిస్టు పార్టీ అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజ్‌తోపాటు 26 మంది ఆదివాసీలను ఎన్కౌంటర్ పేరిట క్రూరంగా కాల్చి చంపారని, ఆపరేషన్ కగార్ పేరిట 2024 నుంచి ఇప్పటివరకు జరిగిన బూటకపు ఎన్కౌంటర్లపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాలని మానవ సంఘాల పక్షాన ఆమె డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీపీఐ(ఎంఎల్) నాయకులు ప్రసాదన్న, ఊక్లానాయక్, రైతుకూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పటోళ్ల నాగిరెడ్డి, వివిధ సంఘాల నాయకులు వెల్తురు సదానందం, కొడెం వెంకటేశ్వర్లు, ఎట్టి ప్రశాంత్, కందగట్ల సురేందర్, పొమ్మన్న, బొమ్మెర్ల రాంబాబు, చంద్రయ్య దొర, మోకాళ్ళ సమ్మయ్య, మండల యుగేందర్, పల్స యాదగిరి, ఆరెళ్లి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.