పాల్వంచ రూరల్, జూలై 7 : నియోజకవర్గాల్లో పోడు పట్టాల పంపిణీ కొనసాగుతున్నది. శుక్రవారం కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు.. పాల్వంచ మండలంలోని తొమ్మిది పంచాయతీల్లో 374 మంది పోడు రైతులకు పట్టాలు పంపిణీ చేశారు. అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు.. ములకలపల్లి మండలంలోని 14 పంచాయతీల్లో 2,237 మంది గిరిజనులకు పట్టాలు అందజేశారు. పట్టాల పంపిణీ వల్ల కలిగే లాభాలు, సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న తీరు గురించి ఎమ్మెల్యేలు వివరించడంతో గిరిజనులు ఆనందపడ్డారు.
“పోడు సాగుదారులకు పట్టాలివ్వాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయంతో పోడు సాగుదారుల జీవితాల్లో వెలుగులు నిండాయి. ఇది వారికి పండుగ రోజు.. రానున్న కాలంలో సీఎం కేసీఆర్కు మనం అందరం అండగా నిలవాలి” అన్ని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. పట్టణంలోని పాత ఆర్డీవో కార్యాలయ ఆవరణలో శుక్రవారం మండలంలోని కోడిపుంజుల వాగు, యానంబైలు, పునుకుల, ప్రభాత్నగర్, సూరారం, బసవతారక కాలనీ, రంగాపురం, తోగ్గూడెం, దంతెలబోర పంచాయతీలకు చెందిన 374 మంది పోడు రైతులకు 834 ఎకరాల భూమి పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పోడు రైతులకు పట్టాలివ్వాలని యాభై ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్నారని, ఇంతవరకు ఏ ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదని, తాను సీఎం కేసీఆర్తో మాట్లాడి, సీఎం వారికి పట్టాలిస్తానని హామీఇవ్వడంతో తాను బీఆర్ఎస్ పార్టీలో చేరానన్నారు. కొత్తగూడెంలోని లక్ష్మీదేవిపల్లిలో అటవీశాఖ అధికారులు పోడు రైతులపై కేసులు పెడితే వారికి అండగా నిలిచి అధికారులను ఎదిరించానన్నారు. గతంలో పోడు సాగు రైతులకు ఎటువంటి సహకారం ఉండేది కాదని, ప్రస్తుతం విద్యుత్తు, రైతుబంధు, రైతు బీమా లాంటి పథకాలు వర్తిస్తున్నాయన్నారు. త్వరలో త్రీఫేస్ కరెంటు, గిరివికాసం పథకం ద్వారా నూరు శాతం సబ్సిడీపై మోటార్లు అందిస్తానన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, తమను ఆదరించిన అందరూ మద్దతుగా నిలిచి రాబోయే ఎన్నికల్లో గెలిపించి కేసీఆర్ను మూడో సారి ముఖ్యమంత్రిని చేయాలన్నారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు కొత్వాల శ్రీనివాసరావు, బరపటి వాసుదేవరావు, మడి సరస్వతి, మార్గం గురవయ్య, మహీపతి రామలింగం, మండే హనమంతరావు, కాంపెల్లి కనకేశ్, మంతపూరి రాజూగౌడ్, మల్లెల శ్రీరామ్మూర్తి, పూసల విశ్వనాధం, ఆచార్యులు, కాల్వ భాస్కర్రావు, కనగాల బాలకృష్ణ, సందోష్గౌడ్, అప్పారావు, నారాయణ తదితరులు పాల్గొన్నారు.