సమయానికి వానల్లేక, పంటలకు సరిపడా యూరియా అందక భద్రాద్రి జిల్లాలో పంట పొలాలు నెర్రెలు వారుతున్నాయి. దీంతో కర్షకులకు కష్టాలు తప్పడం లేదు. సాధారణంగా వానకాలం సీజన్ మాత్రమే అన్నదాతలకు కాస్త వెన్నుదన్నుగా ఉంటుంది. వర్షాలు సమృద్ధిగా కురిసి, ఎరువులు సమపాళ్లలో అందితే అన్నదాత ఇక వెనుదిరిగి చూడకుండా సాగు పనుల్లో నిమగ్నమవుతాడు. కానీ ఈ ఏడాది ఈ రెండూ లోటుగా ఉండడంతో పంటలపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం కన్పిస్తోంది.
ప్రకృతి మీద ఆధారపడే వర్షాల గురించి అటుంచినా.. ప్రభుత్వం తన బాధ్యతగా అందించే ఎరువుల విషయం కర్షకులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఆగస్టు నాటికి అందించాల్సిన మోతాదులో యూరియాను ఇంకా అందించకపోవడంతో రైతులు సొసైటీల దగ్గర, డీలర్ల దగ్గర రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. పైగా, జిల్లాకు సరఫరా చేసిన యూరియాలో ఇంకా 20 శాతం డీలర్ల దగ్గరే ఉండడం, అది రైతుల వద్దకు చేరకపోవడం వంటివి అనుమానాలకు తావిస్తున్నాయి.
-భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ)
యూరియా విషయంలో ప్రభుత్వ వాదనకు, క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులకు పొంతన ఉండడం లేదు. యూరియా కొరతే లేదంటూ ప్రభుత్వం వాదిస్తూ వస్తోంది. కానీ కేంద్ర ప్రభుత్వం తక్కువగా సరఫరా చేసిందంటూ రాష్ట్ర వ్యవసాయ శాఖలు కుండబద్దలు కొట్టారు. తగినంత పంపాలంటూ ఏకంగా కేంద్ర ఎరువుల శాఖ మంత్రికి లేఖలు కూడా రాశారు. ఒకవేళ ప్రభుత్వ వాదనే వాస్తవమనుకుంటే క్షేత్రస్థాయిలో రైతుల భారీ క్యూలైన్ల సంగతేంటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. సొసైటీల వద్ద క్యూలైన్లలో ఉండలేకనో, పంటకు అత్యవసరంగా యూరియా అందించాల్సిన కారణం వల్లనో తప్పనిసరి పరిస్థితుల్లో డీలర్ల వద్దకు వెళితే అక్కడ వారు రైతులను నిలువు దోపిడీ చేసే పరిస్థితి ఏర్పడుతోంది. అధిక ధరలతో డీలర్లు తమ నడ్డివిరుస్తున్నారంటూ అన్నదాతలో లబోదిబోమంటున్నారు. అధికారులు మాత్రం తూతూమంత్రపు తనిఖీలతో సరిపెడుతున్నారు.
లోటు వర్షపాతం..
ఇక సమయానికి వానలు కురవని కారణంగా జిల్లాలోని ఇప్పటికే వరి నాట్లు వేసిన పొలాలు నెర్రెలు వారుతున్నాయి. పత్తి పంటకు కూడా ఇప్పుడు వాన ఎంతో అవసరం. దీంతో అన్నదాతలందరూ వరుణ దేవుడి కరుణ కోసం ఆకాశం వైపు ఆశగా చూస్తున్నారు. ఈ ఏడాది జూన్లో 169.1 మిల్లీ మీటర్ల వర్షం కురియాల్సి ఉండగా 134.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఈ నెలలో సుమారు 20 శాతం లోటు వర్షపాతం నమోదైంది.
ఆ 169.1 మి.మీ వర్షం కూడా కేవలం 12 రోజుల్లోనే కురిసి ఆ తరువాత ఆచూకీ లేకుండా పోయింది. తరువాత జూలైలో 309 మి.మీ వర్షం కురియాల్సి ఉండగా 376 మి.మీ వర్షం కురిసింది. కేవలం కేవలం 21 మి.మీ. వర్షం మాత్రమే అదనంగా కురిసింది. అదీ కూడా 21 రోజుల్లోనే కురిసి తరువాత మటుమాయమైంది. మొత్తంగా జూన్, జూలై నెలల్లో కురవాల్సిన సగటు 478 మి.మీ కంటే 510 మి.మీ. కురిసి కేవలం 6 శాతమే అధికంగా నమోదైంది. దీంతో వరి పొలాలు నెర్రెలు వారుతుండగా.. పత్తి పంట ఎదుగూబొదుగూ లేకుండాపోతోంది.
డీలర్ల వద్ద 3,166 మెట్రిక్ టన్నులు యూరియా?
భద్రాద్రి జిల్లాలో వానకాలం పంటలకు గాను ఈ ఏడాది ఆగస్టు నాటికి 30,277 మెట్రిక్ టన్నులు (ఎంటీ) యూరియా అవసరం. కానీ ఇప్పటి వరకు 19,202 మెట్రిక్ టన్నులు యూరియాను మాత్రమే ప్రభుత్వం సరఫరా చేసింది. ఇందులో ఇప్పటి వరకు 16,736 మెట్రిక్ టన్నుల విక్రయాలు జరిగాయి. ఇంకా 3,166 మెట్రిక్ టన్నుల యూరియా డీలర్లే వద్దే ఉంది. యూరియా కొరతకు ఇదే కారణంగా తెలుస్తోంది. ఇంకా 10,938 మెట్రిక్ టన్నులు యూరియా అవసరమున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.
అన్నదాతల అవసరం.. డీలర్లకు అవకాశం..
వానకాలం పంటకు యూరియా కొరత ఉన్నట్లు గుర్తించిన డీలర్లు.. ఇదే అదునుగా, అవకాశంగా భావించారు. ఒక్కో యూరియా బస్తాను రూ.350 వరకు విక్రయిస్తున్నారు. దీంతో తక్కువ ధర కోసం రైతులు సొసైటీల వద్దకు పరుగులు తీయాల్సి వస్తోంది. జిల్లాలో 20 సొసైటీల పరిధిలో యూరియా విక్రయాలు జరుగుతున్నాయి. అయితే, కొన్ని మండలాల్లో గోదాములు రైతులకు అందుబాటులో లేవు. దీంతో రైతులు తెల్లవారుజామునే వచ్చి లైన్లో నిలబడాల్సి వస్తోంది.
మరోవైపు సొసైటీల్లో బయోమెట్రిక్ సిస్టమ్ వల్ల పంపిణీ ఆలస్యమవుతోంది. ఇదే కారణంతో కరకగూడెంలో ఇటీవల రైతులు నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు. మరికొన్ని ప్రాంతాల్లో కొందరు డీలర్లు స్టాక్ తెప్పించుకొని నిల్వ చేసుకుంటున్నారు. రైతులకు పెట్టుబడి పెట్టి వారికి అప్పు రూపంలో ఎరువులు విక్రయించడం వల్ల కూడా రైతులు నిండా మునిగిపోతున్నారు.
డీలర్లు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు..
కొరత ఉందంటే చాలు డీలర్లకు పండగే. ధర ఎక్కువని అడిగితే స్టాకు లేదంటారు. తప్పని పరిస్థితుల్లో కొనాల్సి వస్తోంది. సొసైటీకి వస్తే గంటల కొద్దీ క్యూలైన్. రైతులకు ఎప్పటికీ కష్టాలు తప్పేలా లేవు. ఎరువుల ధరలతో సాగు చేయలేక పోతున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎరువుల సమస్య తప్పకుండా ఉంటుంది. అధికారులు ఉన్నా ఉపయోగం లేదు.
-అచ్చన రామకృష్ణ, రైతు, అబ్బుగూడెం, అన్నపురెడ్డిపల్లి
సొసైటీకి వెళ్లాలంటే 15 కిలోమీటర్లు దూరం..
ఎరువులు కావాలంటే మేం లక్ష్మీదేవిపల్లి వెళ్లాలి. ఆ మండలంలోనే గోదాము ఉంది. అక్కడకు వెళితే ఒక్కో కట్టకు రూ.50 చొప్పున ఆటో కిరాయి అవుతుంది. రెండు కట్టల కోసం అక్కడ పడిగాపులు కాస్తే ఆటో డ్రైవర్ వెయిటింగ్ చార్జీ పేరిట మరింత ధర చెబుతాడు. ఈ బాధలు భరించలేక బయట కొనుగోలు చేద్దామంటే డీలర్లేమో అధిక ధరలు చెబున్నారు.
-కట్టా సతీశ్, రైతు, రాంపురం, చుంచుపల్లి
కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నాం..
జిల్లాలో యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. అవసరం లేకున్నా కొంతమంది రైతులు యూరియాను కొంటున్నారు. ఎక్కువ ధరకు విక్రయించకూడదని డీలర్లకు చెబుతున్నప్పటికీ వారు దొడ్డిదారిలో విక్రయిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నాం. స్టాకు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంది. ఇంకా పది వేల మెట్రిక్ టన్నులు యూరియా రావాలి. నానో యూరియా కూడా వాడాలని రైతులకు చెబుతున్నాం. రైతులు అంతగా ఆసక్తి చూపడం లేదు. అనుకున్నంత వానలు కురవలేదు. అందుకే రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
-వీ.బాబూరావు, డీఏవో, భద్రాద్రి