విద్యార్థి జీవితంలో ఎంతో కీలకమైన ఇంటర్మీడియట్ పరీక్షలు సీసీ కెమెరాల నడుమ నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ ఏడాది పరీక్షలు జరిగే అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. అయితే నిఘా నీడలో పరీక్షలు నిర్వహించడాన్ని తొలుత ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. కానీ.. ప్రభుత్వంతో జరిపిన చర్చల అనంతరం అంగీకారం తెలిపాయి. భద్రాద్రి జిల్లాలో 102 కళాశాలలుండగా.. 19,271 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. మార్చి 5 నుంచి పబ్లిక్ పరీక్షలు జరుగనుండగా.. ఈ నెల 3 (సోమవారం) నుంచి ప్రాక్టికల్స్ ప్రారంభమయ్యాయి.
– భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ)
సీసీ కెమెరాల నిఘాలోనే పరీక్షలు నిర్వహించాలంటూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ప్రైవేటు కాలేజీల యజమానులు తొలుత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలిసీ తెలియక విద్యార్థులు చేసే పొరపాట్ల వల్ల వారు చిక్కుల్లో పడతారని, వారి భవిష్యత్ ప్రశ్నార్థకమవుతుందని, అలాగే తమకూ ఖర్చుతో కూడుకొని ఉంటుందని కారణాలు చెప్పారు. మొత్తానికి ప్రభుత్వం కూడా వారి వినతిని పరిగణనలోకి తీసుకుంది. అయితే, ఒక నెల గడువులో అన్ని కాలేజీల గదుల్లో సీసీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలంటే సాధ్యం కాదని వారు అభ్యంతరం చెప్పారు. కొంత సమయం పడుతుందని అంటున్నారు. జిల్లాలో 102 జూనియర్ కళాశాలల్లో ప్రభుత్వ కాలేజీలు కేవలం 14 మాత్రమే ఉన్నాయి. 32 ప్రైవేటు కాలేజీలు ఉన్నాయి. ప్రభుత్వంలో బీసీ కాలేజీలు 9, మైనార్టీ కాలేజీలు 9, కేజీబీవీలు 14, ఎస్సీ సంక్షేమ కాలేజీలు 16, ఎస్టీ సంక్షేమ కాలేజీలు 8 ఉన్నాయి.
ఇంటర్మీడియట్ బోర్డు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం జిల్లాలో ఇంటర్ పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఇందులో భాగంగా భద్రాద్రి జిల్లాలో 102 కాలేజీల్లో మార్చి 5 నుంచి 22 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. దీంతోపాటు ఈ నెల 3న ప్రారంభమైన ప్రాక్టికల్స్ 22 వరకు జరుగనున్నాయి.
ఇంటర్ పరీక్షలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం 19,271 మంది విద్యార్థులు ఇప్పటికే ఫీజులు చెల్లించి పరీక్షలు రాసేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రాక్టికల్స్ కోసం 54 కేంద్రాలు, ఒకేషనల్ ప్రాక్టికల్స్ కోసం 11 కేంద్రాలు, థియరీ పరీక్షల కోసం 36 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఐడీవోసీలోని ఇంటర్మీడియట్ ఆఫీసులో స్కాడ్ అధికారులతో ఇంటర్మీడియట్ అధికారి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. పరీక్షల పరిశీలన కోసం టేకులపల్లి కాలేజీ ప్రిన్సిపాల్ సులోచనారాణి, అశ్వారావుపేట కాలేజీ అధ్యాపకులు అరవింద్బాబులను నియమించారు.
ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. ప్రభుత్వ కాలేజీల్లో ఇప్పటికే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అయితే, సీసీ కెమెరాల ఏర్పాటుకు తొలుత ప్రైవేటు కాలేజీ యూనియన్ బాధ్యులు అభ్యంతరం తెలిపారు. కానీ.. ఆయా నిబంధనలను ఇంటర్ బోర్డు పరిశీలించి కొంత సడలించినట్లు తెలిసింది. థియరీ పరీక్షలు మాత్రం సీసీ కెమెరాల పర్యవేక్షణలోనే జరుగుతాయి. లైవ్ వెబ్‌కాస్టింగ్‌కు కొంత వెసులుబాటు ఇచ్చినట్లు తెలిసింది. కానీ.. ఇంతవరకు అధికారికంగా మాకు ఎలాంటి ఆదేశాలు అందలేదు.
-హెచ్.వెంకటేశ్వరరావు, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి, భద్రాద్రి