నకిలీలపై రాష్ట్ర ప్రభుత్వ దృష్టి
జిల్లా, మండల స్థాయిల్లో
టాస్క్ఫోర్సు బృందాలు
విత్తన దుకాణాల్లో విస్తృత తనిఖీలు
కొణిజర్ల, జూన్ 7: వానకాలం సీజన్ సమీపిస్తుండడంతో రైతులు సాగుకు సమాయత్తమవుతున్నారు. ఒక్కో ఏడాది ఒక్కో పంటపై రైతాంగం అధికంగా మక్కువ చూపుతుండడంతో అక్రమార్కులు ఆయా పంట విత్తనాలపై నకిలీల సృష్టికి తెగబడుతున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై పోలీసు, వ్యవసాయ, రెవెన్యూశాఖ అధికారుల సంయుక్తతో టాస్క్ఫోర్సు బృందంగా ఏర్పడి నిరంతర నిఘా ఏర్పాటు చేశారు. ఈ మేరకు టాస్క్ఫోర్సు బృందాలు తనిఖీలు చేపడుతుండడంతోపాటు, జిల్లావ్యాప్తంగా దుకాణాలు, వ్యాపారుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. విత్తన దుకాణాల్లో ప్యాకెట్లను పరిశీలిస్తూ బ్యాచ్నెంబర్లు, తయారీ తేదీ, బార్కోడ్లను నిశితంగా పరిశీలిస్తున్నారు. విక్రయ అనుమతి, లైసెన్స్లు ఉన్న వ్యాపారుల వద్దనే రైతాంగం విత్తనాలను కొనుగోలు చేయాలని, విధిగా బిల్లులు భద్రపర్చుకోవాలని రైతాంగానికి అవగాహన కల్పిస్తున్నారు. నకిలీ విత్తనాలతో పట్టుబడితే పీడీయాక్ట్లు సైతం వెనుకాడబోమని, చట్టరిత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో తీసుకొస్తున్న విప్లవాత్మక మార్పులకు నేపథ్యంలో ఏటకుఏటా కొణిజర్ల మండలంతోపాటు, జిల్లావ్యాప్తంగా సాగు విస్తీర్ణం పెరుగుతున్నది. ఖరీఫ్, రబీ పంటలకు ముందస్తుగానే పంట పెట్టుబడికి రుణాలు, రాయితీపై విత్తనాలు, సకాలంలో ఎరువులు, సాగుకు సరిపడా నీరు, నిరంతర విద్యుత్ సహకారంతో రైతాంగం ప్రతి ఏడాది వ్యవసాయరంగంపై మక్కువ చూపుతున్నారు. గత ఏడాది బహిరంగ మార్కెట్లో పత్తిపంటకు మద్దతు మించి ధర లభించడంతో ఈ ఏడాది పత్తి, మిర్చికు మంచి ధర లభించడంతో ఈ ఏడాది కూడా ఈ రెండు పంటల వైపే రైతాంగం అమిత ఆసక్తి చూపుతున్నారు. ఇదే అదునుగా భావించిన అక్రమార్కులు నకిలీ విత్తనాల దందా సృష్టించే ప్రమాదం ఉండటంతో పోలీసు, రెవెన్యూ, వ్యవసాయశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. గిరిజన తండాలు, మారుమూల గ్రామాలను లక్ష్యంగా చేసుకొని ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాల నుంచి నకిలీ విత్తనాలను, నిషేధిత విత్తనాలను పలు ప్రాంతాల్లో విక్రయించే అవకాశం ఉన్నట్లు ప్రాథమిక అంచనాకు వచ్చిన అధికారులు ఎక్కడికక్కడ తనిఖీలు చేపట్టి వారిపై నిరంతర నిఘా ఉంచుతున్నారు. కొద్దిరోజుల క్రితం ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల ప్రాంతం నుంచి నిషేధిత బీటీ-3 విత్తనాలను తరలిస్తుండగా నిఘా పెట్టిన అధికారులు పెద్దరాంపురం సమీపంలో దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు.
విస్తృతంగా తనిఖీలు
నకిలీ విత్తనాలను అడ్డుకునేందుకు టాస్క్ఫోర్సు సిబ్బంది గ్రామీణ ప్రాంతాలతో పాటు, విత్తన దుకాణాల్లో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా ప్యాకెట్లపై ఉండే విత్తన తయారీ తేదీ, బ్యాచ్నెంబర్, జీవోటీ సర్టిఫికెట్లు, ఇతరత్రా బిల్లులను నిశితంగా గమనిస్తున్నారు. రైతాంగం విత్తనాల కొనుగోలు సమయంలో ఆయా రైతు పేరు పొందుపర్చుతున్నారో లేదో, రైతుల చిరునామా సరిగా రాస్తున్నారో లేదా పరిశీలిస్తున్నారు. విత్తనాలు విక్రయించిన తేదీ, కంపెనీ పేరు, పరిమాణం, కొనుగోలుదారుల సంతకం, విక్రయదారుడి సంతకం, విత్తన సంచులపై ఉన్న లాట్నెంబర్లు పొందుపర్చుతున్నారో లేదా నిశితంగా తనిఖీ చేస్తున్నారు. బ్రాండెడ్ కంపెనీలు తయారు చేసినట్లుగా నకిలీ విత్తనాల కంపెనీలు సైతం అదేస్థాయిలో విత్తనాల ప్యాకెట్లను ముద్రించి మార్కెట్కు సరఫరా చేసే అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టిసారించారు.
రైతులు విధిగా బిల్లులు తీసుకోవాలి
నకిలీ విత్తనాల నివారణకై తెలంగాణ సర్కారు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నది. మండల, గ్రామస్థాయిలో టాస్క్ఫోర్సు బృందాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఏఈవోలు, రైతుబంధు కమిటీ సభ్యులు సైతం నకిలీ విత్తన విక్రయాలపై దృష్టిసారిస్తున్నారు. రైతాంగం లైసెన్స్ ఉన్న దుకాణాల్లో మాత్రమే విత్తనాలు కొనుగోలు చేసి రసీదు తీసుకోవాలి.
– మండల వ్యవసాయాధికారి బాలాజీ