ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 11న ఏడు మున్సిపాలిటీలకు, ఒక మున్సిపల్ కార్పొరేషన్‌కు ఎన్నికలు జరిగిన విషయం విదితమే. శుక్రవారం నాడు కౌంటింగ్ జరుగనుంది. ఇందుకోసం ఆయా మున్సిపాలిటీల పరిధిలోనే ప్రత్యేకంగా కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. మధ్యాహ్నానికి పూర్తి ఫలితాలు వచ్చే అవకాశముంది. తక్కువ వార్డుల నేపథ్యంలో ఒకే రౌండ్లో లెక్కింపు చేపట్టనున్నందున వైరా, కల్లూరు, అశ్వారావుపేట మున్సిపాలిటీల ఫలితాలు జిల్లాలో మొదటగా వెలువడే చాన్స్ కన్పిస్తోంది.
-ఖమ్మం, నమస్తే తెలంగాణ ప్రతినిధి/ భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ, ఫిబ్రవరి 12
ఇప్పటికే మూడంచెల భద్రత మధ్య స్ట్రాంగ్ రూముల్లో బ్యాలెట్ బాక్సులు భద్రపరిచి ఉన్నాయి. శుక్రవారం ఉదయమే పటిష్ట బందోబస్తు మధ్య వాటిని కౌంటింగ్ కేంద్రాలకు తరలించనున్నారు. తొలుత ఆయా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్నారు. అనంతరం వాటితో పూర్తి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఖమ్మం జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలకు చెందిన 116 వార్డులకు; అలాగే.. కొత్తగూడెం కార్పొరేషన్లో 60 డివిజన్లకు, ఇల్లెందు మున్సిపాలిటీలోని 24 వార్డులకు, అశ్వారావుపేట మున్సిపాలిటీలోని 22 వార్డులకు ఎన్నికలు జరిగిన విషయం విదితమే. ఈ ఓట్ల లెక్కింపు కోసం కౌంటింగ్ అధికారులు ఇప్పటికే పలు దఫాలుగా శిక్షణ పొందారు.
పోటీ చేసిన అభ్యర్థుల సమక్షంలో ఓట్ల లెక్కింపు జరుగనుంది. ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీలోని 32 వార్డులకుగాను ఒక వార్డు ఏకగ్రీమైంది. మిగిలిన 31 వార్డులకు ఎన్నికలు జరిగాయి. దీని ఓట్ల లెక్కింపు ప్రక్రియను రెండు రౌండ్లు, పదహారు టేబుళ్ల ద్వారా ఖమ్మం రూరల్ మండలంలోని మేధా ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రంలో చేపట్టనున్నారు. వైరా మున్సిపాలిటీలో 20 వార్డులకు పోలైన ఓట్లను అక్కడి రైతు సమాచార కేంద్రంలోని కౌంటింగ్ హాల్లో లెక్కించనున్నారు. సత్తుపల్లి మున్సిపాలిటీలో 23 వార్డులకు పోలైన ఓట్లను అక్కడి జ్యోతి నిలయంలో, మధిర మున్సిపాలిటీలోని 22 వార్డులకు పోలైన ఓట్లను అక్కడి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో, కల్లూరు మున్సిపాలిటీలో 20 వార్డులకు పోలైన ఓట్లను అక్కడి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలో లెక్కించనున్నారు.
కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లో 60 డివిజన్లకు పోలైన ఓట్లను పాల్వంచలోని అనుబోస్ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలో లెక్కించనున్నారు. అశ్వారావుపేట మున్సిపాలిటీలో 22 వార్డులకు పోలైన ఓట్లను అక్కడి వ్యవసాయ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలో లెక్కించనున్నారు. ఇల్లెందు మున్సిపాలిటీలోని 24 వార్డులకు పోలైన ఓట్లను అక్కడి సింగరేణి కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలో లెక్కించనున్నారు. ఇందుకోసం అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద పూర్తిస్థాయి బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల సమీపంలో ప్రజలు గుమికూడ వద్దంటూ పోలీసులు ఆంక్షలు విధించారు. ఓట్ల లెక్కింపు జరుగుతున్న మున్సిపాలిటీల పరిధిలోని మద్యం షాపులను బంద్ చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.
ఏర్పాట్ల పరిశీలన..
భద్రాద్రి జిల్లాలోని కౌంటింగ్ ఏర్పాట్లను కలెక్టర్ జితేశ్ వి పాటిల్, అదనపు కలెక్టర్ విద్యాచందన, ఎస్పీ రోహిత్ రాజు తదితరులు గురువారం పర్యవేక్షించారు. కొత్తగూడెం కార్పొరేషన్లో 60 డివిజన్లకు గాను 60 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్ వద్ద ముగ్గురు సిబ్బందిని నియమించారు. ఏకకాలంలో 60 టేబుళ్ల వద్ద ఓట్ల లెక్కింపు జరిగేలా చర్యలు తీసుకున్నారు. కౌంటింగ్ ప్రక్రియం మొత్తం సీసీ టీవీల నిఘాలో ఉంటుందని అధికారులు తెలిపారు. అనుమతి ఉన్న వారిని మాత్రమే పోలీసులు కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతించనున్నారు. కౌంటింగ్ తర్వాత విజయోత్సవ ర్యాలీలు చేయకూడదని పోలీసులు స్పష్టం చేశారు. సత్తుపల్లి కౌంటింగ్ కేంద్రంలో ఏర్పాట్లను కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్‌కుమార్ యాదవ్ పరిశీలించారు.