మధిర, అక్టోబర్ 10 : గతంలో గ్రామీణ ప్రాంతాల్లో గర్భిణులు వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆస్పత్రులు, పీహెచ్సీలు, సీహెచ్సీలకు వెళ్లాలంటే ఇబ్బందులు పడేవారు. బస్సులు, ఆటోలు, రిక్షాల్లో వెళ్లి అవస్థలకు గురయ్యేవారు. వీరి కష్టాలను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం అమ్మ ఒడి పథకంలో భాగంగా 102 సేవలను అందుబాటులోకి తెచ్చింది. గర్భిణులు, బాలింతల కోసం సీఎం కేసీఆర్ 2017 జనవరిలో అమ్మ ఒడి పథకాన్ని ప్రతిష్టాత్మకంగా రూపొందించి అమలు చేస్తున్నారు. ఇంటి వద్ద ఉన్న గర్భిణులు వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి వెళ్లాలంటే ఫోన్ చేసిన పది నిమిషాల్లోనే వాహనం ఇంటి ముందు వాలిపోతుంది. సదరు గర్భిణిని ఆస్పత్రికి తీసుకెళ్లి అక్కడ వైద్యులు పరీక్షలు చేసిన తర్వాత మళ్లీ ఇంటి వద్దకు చేర్చుతుంది. దీంతో గర్భిణులు పథకాన్ని ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్ను ఎప్పటికీ మరువలేమంటున్నారు. జిల్లాలోని ఐదే నియోజకవర్గాల పరిధిలో 11 వాహనాలను ప్రభుత్వం కేటాయించింది. వివిధ గ్రామాల నుంచి 2018 నుంచి 2020 వరకు అమ్మ ఒడి కార్యక్రమం ద్వారా 84,883 ట్రిప్పుల ద్వారా 2,42,948 మందిని ఖమ్మం మాతా, శిశు సంరక్షణ కేంద్రాలకు తీసుకెళ్లి తిరిగి పరీక్షలు చేయించి వారివారి గ్రామాలకు పంపించారు. ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, పీహెచ్సీ పరిధిలోని గ్రామాలకు 102 వాహనాల ద్వారా విస్తృతంగా సేవలందిస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో గర్భిణులకు ప్రసవమైన తర్వాత తల్లీబిడ్డను క్షేమంగా కేసీఆర్ కిట్టు అందజేసి.. మందులను ఉచితంగా అందజేసి వారిని అమ్మ ఒడి 102 వాహనం ద్వారా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇళ్లకు పంపిస్తున్నారు.
2,43,000 మందికి సేవలు అందించాం
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మ ఒడి 102 సేవలను జిల్లాలోని 20 మండలాల్లో కల్పిస్తున్నాం. 2018 జనవరి నుంచి 2023 జూలై వరకు 2,43,000 మందిని ఖమ్మం, మధిర, సత్తుపల్లి, మంచుకొండ, కామేపల్లి, ఏన్కూరు, వైరా, నేలకొండపల్లి ఆస్పత్రులకు తరలించాం. గర్భిణులకు పరీక్షలు చేసిన తర్వాత తిరిగి వారి స్వగృహాలకు పంపిస్తున్నాం. ప్రసవం తర్వాత తల్లీబిడ్డలతోపాటు కుటుంబ సభ్యులను కూడా వారి ఇళ్లకు ఎటువంటి ఖర్చు లేకుండా చేర్చుతున్నాం. ఈ పథకాన్ని గర్భిణులు సద్వినియోగం చేసుకోవాలి.
– భూమా నాగేందర్, 102 ప్రోగ్రాం మేనేజర్, ఖమ్మం
రవాణా కష్టాలు తప్పాయి
నాకు పెళ్లయి ఏడాదిన్నర అవుతుంది. నేను గర్భిణిగా ఉన్నప్పటి నుంచి 102 వాహనం ద్వారానే వైద్య పరీక్షలకు వెళ్తున్నా. మా కుటుంబ సభ్యులు ఫోన్ చేయగానే పది నిమిషాల్లో మా ఇంటి దగ్గరకు వాహనం వస్తుంది. నాకు ఇప్పుడు తొమ్మిదో నెల. ప్రతి నెలా వైద్య పరీక్షల నిమిత్తం మధిర ప్రభుత్వ ఆస్పత్రికి 102 వాహనం ద్వారానే వెళ్లాను. నా బిడ్డను 3 నెలలు మోసిన తల్లిని నేనైతే.. నన్ను, నా బిడ్డను తొమ్మిది నెలలుగా మోసిన తల్లి 102 వాహనం. పథకం ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం.
– ఏడుకొండల వైష్ణవి, గర్భిణి, మర్లపాడు, మధిర మండలం
ప్రభుత్వ సహకారం బాగుంది
మాది తెలంగాణ రాష్ట్ర సరిహద్దు గ్రామం కావడంతో ప్రతి చిన్న వైద్య అవసరానికి సొంత ఖర్చులతో పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి వెళ్లాల్సి వచ్చేది. కానీ.. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న వైద్య సౌకర్యాలతో పేదలు ధైర్యంగా జీవిస్తున్నారు. మొదట తనను బనిగండ్లపాడు పీహెచ్సీకి వైద్య పరీక్షల నిమిత్తం 102 వాహనంలో తీసుకెళ్లి పరీక్షలు చేశారు. ప్రసవం సమయానికి తనను ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి నార్మల్ డెలివరీ చేయించారు. ప్రస్తుతం నేను 9 నెలల గర్భవతిని. ఇప్పుడు కూడా 102 వాహనంలో తీసుకెళ్లి ప్రతి నెలా స్కానింగ్ చేస్తూ వైద్య పరీక్షలు చేయిస్తూ కంటికి రెప్పలా చూసుకుంటున్నారు.
– గరినెపూడి కవిత, గర్భిణి, రాజుపాలెం, ఎర్రుపాలెం మండలం