కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులు, కిశోర బాలికలకు పోషకాహారం అందిస్తున్నాయి. పోషకాహార పంపిణీలో పారదర్శకత కోసం కేంద్ర ప్రభుత్వం ముఖ ఆధారిత గుర్తింపు (ఫేషియల్ రికగ్నేషన్)ను అమల్లోకి తీసుకొచ్చింది. పోషణ్ ట్రాకర్ అనే యాప్‌లో లబ్ధిదారుల వివరాలను నమోదు చేసిన తర్వాతే పోషకాహార సరుకులను వారికి అందజేయాల్సి ఉంది. సర్వర్ సమస్య కారణంగా యాప్ తరచూ మొరాయిస్తోంది.
ఒక్కోసారి 2 నుంచి 3 గంటలపాటు పని చేయడం లేదు. ప్రధానంగా గ్రామీణ శివారు ప్రాంతాల్లో సర్వర్ అసలే పని చేయడం లేదు. దీంతో గర్భిణులు, బాలింతలు, చిన్నారుల తల్లిదండ్రులను సిగ్నల్ ఉన్న ప్రాంతానికి తీసుకొచ్చి మరీ ఫేషియల్ రికగ్నేషన్‌ను నమోదు చేయాల్సి వస్తోంది. దీంతో కోసం అంగన్వాడీలు అష్టకష్టాలు పడుతున్నారు. లబ్ధిదారులు కూడా రోజుల తరబడి అంగన్వాడీ కేంద్రాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. పోషకాహార లోపాన్ని అధిగమించేలా కిశోర బాలికలకు మిల్లెట్లు; గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు బాలామృతం, కోడి గుడ్లు, అన్నం, పప్పు, పాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నాయి.
పోషకాహార పంపిణీలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యతో అంగన్వాడీ టీచర్లు ఎక్కువ సమయం వేచి చూసే ధోరణిలో ఉంటున్నారు. దీంతో చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్యను అందించేందుకు వారికి సమయం సరిపోవడం లేదు. ప్రతి నెలా రెండుసార్లు లబ్ధిదారులకు పోషకాహారం పంపిణీ చేయాల్సి ఉంటుంది. పోషణలోపం ఉన్న చిన్నారులకు కూడా అదనంగా పౌషకాహారాన్ని అందజేయాలి.
అయితే, పంపిణీ తీరు పర్యవేక్షణ కోసం, పంపిణీలో పారదర్శకత కోసం కేంద్ర ప్రభుత్వం ఏడాది క్రితం పోషణ్ ట్రాకర్ యాప్‌ను తీసుకొచ్చింది. ఒకవేళ ముఖ ఆధారిత గుర్తింపు నమోదు కాకపోయినా రిజిస్టర్లో సంతకం తీసుకుని సరుకులు పంపిణీ చేశారు. కానీ కేంద్ర ప్రభుత్వం జూలై నెల నుంచి ముఖ ఆధారిత గుర్తింపు నమోదును తప్పనిసరి చేసింది. సర్వర్ సమస్య కారణంలో యాప్ మొరాయిస్తుండడంతో టీచర్లు పదేపదే ప్రయత్నిస్తున్నారు. అలాగే, సరుకుల కోసం లబ్ధిదారులు కూడా గంటల కొద్దీ అంగన్వాడీ కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఈ యాప్‌తోనే టీచర్లు ఆపసోపాలు పడుతుండడంతో ఎక్కువ సమయం వృథా అవుతోంది. చదువు చెప్పేందుకు సరైన సమయం కేటాయించలేకపోవడంతో చిన్నారుల చదువులు అటకెక్కుతున్నాయి.
లబ్ధిదారులకు ఒక నెలలో సరుకులు సక్రమంగా పంపిణీ జరగకపోతే మరుసటి నెల కేటాయింపుల్లో కోత పడుతోంది. ప్రతి నెలా 15వ తేదీలోగా అంగన్వాడీ కేంద్రం పరిధిలోని లబ్ధిదారులకు పోషకాహారం సరుకులు పంపిణీ చేయాల్సి ఉంటుంది. నిర్దేశిత సమయంలోగా యాప్‌లో నమోదైన పంపిణీ వివరాలు ఆధారంగా మరుసటి నెలకు ఆయా కేంద్రాలకు ప్రభుత్వం సరుకులను కేటాయిస్తుంది. సర్వర్ సహా ఇతర సమస్యలతో నిర్దేశిత గడువులోగా సరుకుల పంపిణీ జరగకపోతే మరుసటి నెలలో సమస్య తలెత్తుతోంది. ఇప్పటి వరకు భౌతికంగా రిజిస్టర్లో సంతకం చేయించుకునే వెసులుబాటు ఉండడంతో పంపిణీలో, కేటాయింపుల్లో ఇబ్బంది ఎదురవలేదు. కేంద్ర ప్రభుత్వం జూలై నెల నుంచి ఫేషియల్ రికగ్నేషన్‌ను తప్పనిసరి చేయడంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.
యాప్‌లో లబ్ధిదారుల ముఖ ఆధారిత గుర్తింపు నమోదు ఇబ్బందికరంగా ఉంది. ఏజెన్సీ ప్రాంతాల్లో సర్వర్ పనిచేయక గంటల తరబడి అవస్థలు పడుతున్నాం. లబ్ధిదారుల రిజిస్ట్రేషన్ సకాలంలో పూర్తి కావడం లేదు. పోషణ్ ట్రాకర్ యాప్‌లో ఈ-కేవైసీ నమోదులోనూ జాప్యం జరుగుతోంది. ఈ నెలలో సరుకులు ఇవ్వలేని పక్షంలో మరుసటి నెల లబ్ధిదారులకు కోటా కేటాయింపులో కోత పడే ప్రమాదం ఉంది.
– పీ.కృష్ణవేణి, అంగన్వాడీ టీచర్, అశ్వారావుపేట
పోషణ్ ట్రాకర్ యాప్‌లో ఉత్పన్నమవుతున్న సమస్యల పరిష్కరానికి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నాం. దేశ వ్యాప్తంగా ఒకేసారి అంగన్వాడీ కేంద్రాల పని సమయంలో సర్వర్ సమస్య ఉత్పన్నమవుతోంది. దీంతోపాటు ఈ-కేవైసీ పూర్తికాకపోవడం, ఆధార్ అప్డేట్ కాకపోవడం వంటివి మరికొన్ని ప్రధాన కారణాలు. ఈ నెలాఖరులోగా సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం.
-సంపత్, పోషణ్ అభియాన్ జిల్లా కో ఆర్డినేటర్, కొత్తగూడెం