గుండాల, నవంబర్ 21: రైతుల పంట పొలాలకు, గృహ వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన విద్యుత్‌ను అందించడమే విద్యుత్ శాఖ లక్ష్యమని, అప్పుడే ఆ శాఖకు సరైన గుర్తింపు ఉంటుందని ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి అన్నారు. లో ఓల్టేజి సమస్య రాకుండా 5 ఎంవీఏ బూస్టర్లు అమర్చామని, దీంతో ఇక లో ఓల్టేజి సమస్య ఉండదని తెలిపారు. లింగగూడెం, సాయనపల్లి, గుండాల, ముత్తాపురం, మామకన్ను గ్రామాల్లో శుక్రవారం ఆయన పర్యటించారు. వినియోగదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు.
కొత్త వ్యవసాయ సర్వీసుల మంజూరు కోసం మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలని రైతులకు సూచించారు. అనంతరం సాయనపల్లి గ్రామంలో పర్యటిస్తూ కొత్త సబ్‌స్టేషన్‌కు స్థల సేకరణ చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ముత్తాపురంలో కూడా కొత్త సబ్‌స్టేషన్ పనులు ప్రారంభిస్తామని చెప్పారు. విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేయాలని, ఏజెన్సీ గ్రామాల్లో విద్యుత్ సరఫరా విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆ శాఖ సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట ఎస్ఈ ఆపరేషన్ జి.మహేందర్, డీఈలు అనిల్‌కుమార్, రంగస్వామి, ఎన్.కృష్ణ, జీవన్‌కుమార్, వెంకటేశ్వర్లు, ఏడీఈలు, ఏఈలు ఉన్నారు.