ఖమ్మం, జూన్ 27 : తెలంగాణలో కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరు ఆక్షేపణీయమని రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. పార్టీ ఫిరాయింపులకు వారి పార్టీ వ్యతిరేకమంటూ మ్యానిఫెస్టోలో పెట్టుకున్న హస్తం పార్టీ.. ఇప్పుడు అందుకు భిన్నంగా, అప్రజాస్వామికంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తోందని దుయ్యబట్టారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్రహించబోమంటూ చెప్పిన ఆ పార్టీ.. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తుండడం తీవ్ర అభ్యంతరకరమని అన్నారు. ఈ పద్ధతికి కాంగ్రెస్ వెంటనే స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ కేఆర్ సురేశ్‌రెడ్డి, సహచర రాజ్యసభ సభ్యుడు డాక్టర్ బండి పార్థసారథిరెడ్డితో కలిసి ఢిల్లీలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో రవిచంద్ర మాట్లాడారు. తెలంగాణలోని పాలమూరు – రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి నిధులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తెలంగాణ కొంగు బంగారమైన సింగరేణి.. తమ రాష్ట్రానికిదే గొప్ప ఆదాయవనరని అన్నారు. దానిని ప్రైవేటుపరం చేసేందుకు తమ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని స్పష్టం చేశారు. గనుల పరిరక్షణ కోసం తమ నాయకుడు కేసీఆర్ నేతృత్వంలో ఇకముందు కూడా పోరాడుతామని తేల్చిచెప్పారు. కేంద్ర గనుల శాఖ మంత్రిగా ఉన్న తెలంగాణకు చెందిన కిషన్‌రెడ్డి.. తగు చొరవ తీసుకోవాలని కోరారు. బయ్యారంలో ఉకు కర్మాగారాన్ని నెలకొల్పేలా వెంటనే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలోని బయ్యారంతోపాటు దాని పొరుగునే ఉన్న ఛత్తీస్‌గఢ్ బైలఢిల్లాలో ఇనుప ఖనిజం సమృద్ధిగా ఉందని అన్నారు. దానిని సద్వినియోగం చేసుకుంటూ ఉకు కర్మాగారం నెలకొల్పితే తెలంగాణ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందుతుందని వివరించారు. అలాగే కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కూడా ఏర్పాటుచేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం, తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్రమంత్రులుగా బాధ్యతలు చేపట్టిన కిషన్‌రెడ్డి, బండి సంజయ్, రామ్మోహన్నాయుడు, చంద్రశేఖరరావులకు వద్దిరాజు శుభాకాంక్షలు తెలిపారు.
రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖర్‌తో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ఫ్లోర్ లీడర్ సురేశ్‌రెడ్డి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ వద్దిరాజు రవిచంద్ర, రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్డి తదితరులు గురువారం ఢిల్లీలో సమావేశమయ్యారు.