దుమ్ముగూడెం, అక్టోబర్ 19: తమ గ్రామం మీదుగా ఇసుక లారీలు రావొద్దని దుమ్ముగూడెం మండల సరిహద్దులోని ఏపీలో ఉన్న కన్నాయిగూడెం గ్రామస్తులు మరోసారి రాస్తారోకో చేశారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు అటుగా వచ్చిన వాహనాలన్నింటినీ గ్రామస్తులు నిలిపివేయడంతో సాధారణ ప్రయాణికులు, పర్ణశాలకు వెళ్లే రామభక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇదే డిమాండ్‌పై వారం రోజుల క్రితం ఇదే గ్రామస్తులు అర్ధరాత్రి రాస్తారోకో చేసిన విషయం విదితమే.
తమ గ్రామం మీదుగా వేలాది ఇసుక లారీలు రాకపోకలు సాగించడం వల్ల తమ ఇళ్లన్నీ దుమ్మూధూళితో నిండిపోతున్నాయని, రాత్రివేళ కూడా నిరాటంకంగా లారీలు రాకపోకలు సాగిస్తుండడంతో తాము రోడ్డు దాడే పరిస్థితి లేకుండా పోయిందని, ప్రమాదాల భారిన పడుతున్నామని, లారీల వల్ల భారీ గుంతల ఏర్పడి రోడ్డు ధ్వంసమై తాము గాయాలపాలవుతున్నామని, గుంతల్లో లారీలు దిగబడడం వల్ల తీవ్రమైన ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయంపై వారం రోజుల క్రితం కన్నాయిగూడెం గ్రామస్తులతోపాటు భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల మండలాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున రాస్తారోకోలో చేశారు. ఇసుక లారీలు దండెత్తడం వల్ల రోడ్లు ధ్వంసమై తాము ప్రమాదాల భారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
అప్పుడు స్పందించిన ప్రభుత్వం భద్రాచలం నుంచి దుమ్ముగూడెం, కన్నాయిగూడెం మీదుగా వెళ్లే ఇసుక లారీలను వెంకటాపురం వైపు మళ్లించింది. వారం రోజుల పాటు ఇసుక కూపన్ల జారీని కూడా నిలిపివేసింది. ప్రభుత్వం విధించిన వారం రోజుల గడువు ముగిసిపోవడంతో లారీల దండయాత్ర మళ్లీ మొదలైంది. శనివారం నుంచి వేలాది లారీలు మళ్లీ భద్రాచలం మీదుగానే రాకపోకలు సాగిస్తుండడంతో సాధారణ ప్రజలకు, ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ మార్గంలోని 16 కిలోమీటర్ల రహదారి మొత్తం బురదమయం, గుంతలమయం కావడంతో ఇరు రాష్ర్టాల ప్రజలకు నరకం కన్పిస్తోంది. ఆదివారం కన్నాయిగూడెం, సీతంపేట గ్రామస్తులు తిరగబడి లారీలను ఎక్కడికక్కడ నిలిపివేయడంతో ట్రాఫిక్‌కు తీవ్ర ఆటంకం ఏర్పడింది. సమాచారం అందుకున్న ఎటపాక పోలీసులు వచ్చి గ్రామస్తులతో చర్చించినప్పటికీ వారు రాస్తారోకో విరమించలేదు. సాయంత్రం వరకు పరిస్థితి అలాగే కొనసాగింది.