భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 18: వేసవిలో నీటి ఎద్దడి సమస్య తలెత్తకుండా కార్యచరణ రూపొందించాలని జిల్లా కలెక్టర్ జీతేశ్ వీ పాటిల్ అన్నారు. ఐడీఓసీ కార్యాలయం నుంచి హైదరాబాద్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయ రంగానికి, తాగునీటికి, నిర్మాణ రంగానికి విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో విద్యుత్ వినియోగంపై అధికారులతో సమీక్షిస్తూ అవసరమైన చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
రైతు భరోసా పథకం క్రింద అర్హులైన అందరికీ పథకం అందేలా చర్యలు చేపడుతున్నామని జీతేశ్ వీ పాటిల్ చెప్పారు. రేషన్ కార్డుల కోసం ప్రజా పాలనలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారుల సమన్వయంతో క్షేత్రస్థాయిలో పరిశీలన ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తన నియమావళి ముగిసిన వెంటనే అర్హులైన వారికి రేషన్ కార్డుల జారీకి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వేసవిలో ప్రజలకు త్రాగునీటి సమస్య లేకుండా జిల్లాలోని మారుమూల ప్రాంతాల వరకు నీటిని అందించేందుకు అధికారుల సమన్వయంతో కార్యచరణ రూపొందిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డీ వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన జడ్పీ సీఈవో నాగలక్ష్మి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, మిషన్ భగీరథ ఈఈలు తిరుమలేష్, నళిని, జిల్లా విద్యుత్ శాఖ అధికారి జీ మహేందర్, నీటి పారుదల శాఖ ఈ ఈ రాంప్రసాద్, పౌర సరఫరాల శాఖ అధికారులు త్రినాధ్ బాబు, రుక్మిణి, కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్ శేషాంజన స్వామి తదితరులు పాల్గొన్నారు.