రఘునాథపాలెం, మార్చి 3: రఘునాథపాలెం మండలం శివాయిగూడెం కొత్త కాలనీ (పువ్వాడ ఉదయ్‌నగర్)లో 900 మంది పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాల బై బ్యాక్‌కు వ్యతిరేకంగా సీపీఎం ఆధ్వర్యంలో బాధితులు సోమవారం ఖమ్మం కలెక్టరేట్‌ను ముట్టడించారు. ధర్నాచౌక్ నుంచి ప్రదర్శనగా కలెక్టరేట్ వద్దకు బాధితులతో వెళ్లిన సీపీఎం నేతల బృందం కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తతకు దారితీసింది. కొద్దిసేపు తోపులాట జరిగింది. తమ ఇళ్ల స్థలాలు గుంజుకోవద్దని బాధితులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. శివాయిగూడెం కొత్త కాలనీ (పువ్వాడ ఉదయ్‌నగర్)లో పేదల ఇళ్ల స్థలాల బై బ్యాక్ ప్రక్రియను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రజాగ్రహానికి గురవుతారని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు ఇవ్వకపోగా.. ఇచ్చిన స్థలాలను గుంజుకునే ప్రయత్నం చేయడం సరికాదని అన్నారు. ఆ పార్టీ నాయకులు ఎర్రా శ్రీకాంత్, వై.విక్రం తదితరులు పాల్గొన్నారు.