మధిర, మార్చి 17 : రైతు భరోసా పథకం అమలు అయ్యేందుకు వ్యవసాయ, రెవెన్యూ, ఆర్థిక శాఖలకు సంబంధించిన మంత్రులు ఉన్న రైతులకు ప్రయోజనం లేకుండా పోయిందని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మండల కార్యదర్శి చావా మురళీకృష్ణ అన్నారు. సోమవారం మున్సిపాలిటీ పరిధిలోని మడుపల్లి సిపిఐ కార్యాలయంలో రైతు సంఘం ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చావా మురళీకృష్ణ మాట్లాడుతూ.. రెండు, మూడు ఎకరాలలోపు ఉన్న రైతులకు కొందరికి మాత్రమే రైతు భరోసా డబ్బులు పడ్డాయన్నారు. చాలామందికి రైతు భరోసా పడలేదన్నారు. షరతులు లేకుండా రైతులందరికి పూర్తిస్థాయిలో ప్రభుత్వం రైతు భరోసా అందివ్వాలన్నారు.
అలాగే ఇచ్చిన హామీ ప్రకారం రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర, పంటల బీమాను కల్పించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం చేసిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని అయన డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను అందరూ వ్యతిరేకించాలన్నారు. స్వామినాథన్ కమిటీ సూచన మేరకు అన్ని రకాల పంటలకు, ఖర్చుకు అదనంగా 50 శాతం కలిపి మద్దతు ధర నిర్ణయించాలన్నారు. ఈ నెల 20న ఖమ్మం జిల్లా వైరాలో జరిగే రైతు సంఘం జిల్లా మహాసభలకు రైతులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో సిపిఐ మండల కార్యదర్శి ఊట్ల కొండలరావు, జిల్లా సమితి సభ్యులు పెరుమాళ్లపల్లి ప్రకాశ్ రావు, రైతు సంఘం మండల అధ్యక్షులు పంగా శేషగిరిరావు, ఊట్ల కామేశ్వరరావు, అన్నవరపు సత్యనారాయణ, ఎస్ కే సబ్జాన్, కాసిన గోపాలరావు, శిలువేరు సత్యం పాల్గొన్నారు.