బోధన్, జూన్ 14: బోధన్ పట్టణంలోని అన్ని వార్డుల వారీగా బల్దియా అధికారులు, కౌన్సిలర్లు పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. మురికి కాలువలను శుభ్రం చేయించడంతో పాటు లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలువకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. పట్టణంలోని 19, 25, 38వ వార్డుల్లో మంగళవారం నిర్వహించిన పారిశుద్ధ్య కార్యక్రమాలను ఆర్డీవో రాజేశ్వర్, మున్సిపల్ చైర్పర్సన్ తూము పద్మావతి, కమిషనర్ జి. రామలింగం, డీఈఈ లింగంపల్లి శివానందం పర్యవేక్షించారు. మున్సిపల్ ఏఈ సూర్య శ్రీనివాస్, కౌన్సిలర్ తూము శరత్రెడ్డితో పాటు కైజర్, మున్సిపల్ ఉద్యోగులు పాల్గొన్నారు.
భీమ్గల్ను సుందరంగా తీర్చిదిద్దుకుందాం..
భీమ్గల్, జూన్ 14: అందరి సహకారంతో పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుకుందామని భీమ్గల్ బల్దియా చైర్పర్సన్ కన్నె ప్రేమలతా సురేందర్ అన్నారు. పట్టణంలోని ఒకటో వార్డులో మంగళవారం నిర్వహించిన పట్టణ ప్రగతిలో ఆమె పాల్గొని మాట్లాడారు. వార్డులో మొక్కను నాటిన అనంతరం ప్రజలతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. పట్టణ ప్రగతిపై సమావేశం నిర్వహించారు. చైర్పర్సన్ దంపతులను కాలనీవాసులు సన్మానించారు. వైస్ చైర్మన్ భగత్, రిటైర్డ్ డీఎంహెచ్వో బసంత్రెడ్డి, కౌన్సిలర్లు లత, భూదేవి, బల్దియా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పనుల పరిశీలన..
ఆర్మూర్, జూన్ 14: ఆర్మూర్లో బల్దియా చైర్పర్సన్ పండిత్ వినిత ఆధ్వర్యంలో కొనసాగుతున్న పట్టణ ప్రగతి పనులను బల్దియా సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. రెండో వార్డులో చేపడుతున్న పనులను శానిటరీ ఇన్స్పెక్టర్ మహేశ్ పరిశీలించి, చెత్తా చెదారాన్ని బల్దియా కార్మికులతో శుభ్రం చేయించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు తలారి మీనా చందు, అయ్యప్ప లావణ్యా శ్రీనివాస్, ఏనుగంటి వరలక్ష్మీ లింబాద్రిగౌడ్, ఖాందేశ్ సంగీతా శ్రీనివాస్, మేడిదాల సంగీతా రవిగౌడ్, లిక్కి శంకర్, ప్రత్యేకాధికారులు దోండి రమేశ్, అమృత్రావు తదితరులు పాల్గొన్నారు.