ఖమ్మం, సెప్టెంబర్ 5: మున్నేరు ప్రకోపానికి ఐదు రోజులు గడిచిపోయాయి. కానీ దాని ముంపు ప్రాంత ప్రజల వెతలు తీరలేదు. వారి కాలనీల్లోని బురద తొలగలేదు. ఇక సర్కారు సాయం సున్నాగానే మిగిలిపోయింది. సీఎం వచ్చి చూశారు. రూ.10 వేల సాయం ఇస్తానన్నారు. కానీ ఇంత వరకూ దాని ఊసే లేదు. ఇంకా సర్వేలతోనే కాలయాపన చేస్తున్నారు.
దీంతో సర్కారు నమ్మకం కోల్పోయిన నగర ప్రజలు.. తమ ఇళ్లను శుభ్రం చేసుకునే పనిలో నిమగ్నయ్యారు. ఈ క్రమంలో ఒక్కో కాలనీలో ఒక్కో విధమైన దయనీయ దృశ్యాలు కన్పిస్తున్నాయి. ఇక నీటి సరఫరా, విద్యుత్ పునరుద్ధరణ వంటివి లేవు. చాలా ప్రాంతాలు ఇంకా చీకట్లోనే మగ్గుతున్నాయి. పాములు, తేళ్లు, కొండచిలువల భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అక్కడక్కడా నామమాత్రంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు తప్ప.. ప్రభుత్వ పరంగా ఆదుకున్న ఆనవాళ్లు ఎక్కడా లేవు.
ప్రకాశ్‌నగర్ ప్రజల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇది శివారు ప్రాంతం కావడంతో మంచినీటి ట్యాంకర్లు లోపలికి వెళ్లడం లేదు. దీంతో అక్కడి ప్రజలు గుక్కెడు తాగునీళ్లకూ అల్లాడుతున్నారు. ఇక ఇంట్లో వినియోగానికీ నీళ్లు లేకపోవడంతో బురదలోనే ఉంటున్నారు. వివిధ స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న సాయం మినహా ప్రభుత్వం నుంచి అందిన సాయం పెద్దగా ఏమీ లేదు. పైగా గడిచిన రెండు రోజులుగా కురుస్తున్న తేలికపాటి వర్షాలు ఇక్కడి ప్రజల్లో మరికొంత ఆందోళనను పెంచుతున్నాయి.
ఒకవేళ మళ్లీ పెద్ద వర్షం వస్తే తమ బతుకులు ఎలాగంటూ భయాందోళన చెందుతున్నారు. పాఠశాలకు సెలవులు ఇవ్వడంతో ముంపు ప్రాంతంలో ఉన్న పాఠశాలల విద్యార్థులందరూ వారి బంధువుల ఇళ్లకు వెళ్లారు. చాలామంది విద్యార్థుల పుస్తకాలన్నీ వరదకు కొట్టుకుపోవడం, తడిచి పనికిరాకుండా పోయాయి. దీంతో ఎప్పుడూ చిరునవ్వులు చిందే వారి మోములు ఇప్పుడు కళతప్పాయి.
మున్నేరు ముంపు బాధితుల కష్టాలు తెలుసుకుంటానంటూ నాలుగు రోజుల క్రితం వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. మునిగిన ప్రతి ఇంటికీ రూ.10 వేల తక్షణ సాయం అందిస్తానని మాట ఇచ్చి వెళ్లారు. నాలుగు రోజులు గడిచినా ఆ రూ.10 వేల జాడలేదు. కట్టుబట్టలతో మిగిలిన తమకు ఆ సాయమన్నా అందుతుందేమోనని ఎంతోమంది ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు.
సర్వేలతో కాలయాపన చేస్తున్నారు తప్ప ఇంత వరకూ ఏ ఒక్కరికీ ఆ సాయాన్ని అందించలేదు. అయితే సర్వే సమయంలో బాధితులు మరికొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. సర్వేకు వచ్చిన అధికారులు.. బాధితుల బ్యాంకు ఖాతాల నెంబర్లు అడుగుతుండడం, ఇటీవలి వరదల్లో ఆ బ్యాంకు పాస్‌పుస్తకాలన్నీ కొట్టుకుపోవడం, తమ ఖాతాల నెంబర్లు తెలియకపోవడం వంటి కారణాలతో ఈ ఇసుమంత సాయాన్నీ పొందలేకపోతున్నారు.
రఘునాథపాలెం, సెప్టెంబర్ 5: మండలంలోని పాపటపల్లి ప్రజలు కూడా వారం రోజులుగా వర్షపు నీటితోనే సావాసం చేస్తున్నారు. ఏకధాటిగా కురుస్తున్న వర్షాల వల్ల ఆ గ్రామంలోని లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరింది. డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో వారం రోజులుగా అక్కడి ఇళ్ల మధ్యనే నీరు నిలిచి ఉంది. ఇళ్లను నీళ్లు చుట్టుముట్టడం, ఇళ్లలోకి వరద నీరు రావడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.