నమస్తే తెలంగాణ నెట్వర్క్, డిసెంబర్ 29 : ఆరు గ్యారెంటీలు, అలవిగాని హామీలు, అబద్ధపు ప్రచారాలతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకైంది ‘నమస్తే తెలంగాణ’. హామీలు అమలు చేయకపోవడం, పాలనలో వైఫల్యం చెందడం, అన్ని వర్గాల ప్రజలను ఇక్కట్లపాలు చేయడం వంటి అంశాలపై ప్రశ్నిస్తూ సమర్థవంతమైన పత్రికగా నిలిచింది. ఆయా అంశాలు, సమస్యలపై సమగ్రమైన కథనాలు ప్రచురించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది.

ముఖ్యంగా అన్నదాతల అరిగోసలను, వారి బలవన్మణాలకు గల కారణాలను కళ్లకు కట్టింది. అన్ని రంగాల, భిన్న వర్గాల ప్రజల తీవ్రమైన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. ప్రధానంగా ప్రభుత్వం అవలంబించిన ప్రజా వ్యతిరేక విధానాలను, ప్రభుత్వ వైఫల్యాలను ఎక్కడికక్కడ ఎండగట్టేలా వార్తా కథనాలను ప్రచురించింది. అలాగే, వివిధ ప్రభుత్వ శాఖల నిర్లక్ష్యాలను వార్తలుగా మలిచి ప్రజల ముందు ఉంచింది.

ప్రభుత్వం చెంతకు చేర్చింది. మరోవైపు, పలువురు అక్రమార్కుల ఆగడాలను, అక్రమాలను వెలుగులోకి తీసుకొచ్చింది. అదేవిధంగా, విద్యార్థుల నుంచి మొదలుకొని యువతీ యువకులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, కార్మికులు, పింఛన్దారులు, వృద్ధులు, దివ్యాంగుల ఇబ్బందులను, సమస్యలను సమర్థంగా, సమగ్రంగా విశ్లేషించింది.
అవి ప్రభుత్వం దృష్టికి, ప్రభుత్వ యంత్రాంగం దృష్టికి వెళ్లేలా చొరవ చూపింది. వారి సమస్యల పరిష్కారానికి విశేష కృషి చేసింది. మరో రెండు రోజుల్లో 2025 ముగిసి 2026 నూతన సంవత్సరం మన ముంగిటకు వస్తున్న నేపథ్యంలో 2025లో ‘నమస్తే’ తన నుంచి వెలువడిన ప్రత్యేక కథనాల సమాహారాన్ని మాలగా గుదిగుచ్చి ‘నమస్తే తెలంగాణ-2025’ పునరావలోకనం-1గా అందిస్తోంది.