ఖమ్మం రూరల్, డిసెంబర్ 22 : గ్రామ పంచాయతీ పాలన బాధ్యతల నుంచి స్పెషల్ ఆఫీసర్లు తప్పుకున్నారు. ఈ స్థానంలో స్థానిక సంస్థల్లో ఇటీవల విజయం సాధించిన పంచాయితీ పాలకవర్గాలు బాధ్యతలు చేపట్టాయి. సోమవారం ఖమ్మం జిల్లా రూరల్ మండలంలోని 21 పంచాయతీల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. 2024 జనవరి 30వ తేదీన నాటి పంచాయతీ పాలకవర్గాల గడువు ముగియడంతో ఆ స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్ల బాధ్యతను అప్పగించింది. దీంతో 2 ఫిబ్రవరి 2024న గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్లుగా ఆయా శాఖలకు చెందిన గెజిటెడ్ ఆఫీసర్లు బాధ్యతలు చేపట్టారు. దాదాపు రెండేళ్ల పాటు పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగింది. ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికల అనంతరం ఎట్టకేలకు సోమవారం నూతనంగా ఎన్నికైన పాలకవర్గాలు బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా పంచాయతీ కార్యాలయాలను సంబంధిత పంచాయతీ కార్యదర్శులు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. తమ అనుచర గణం, నాయకుల ఆధ్వర్యంలో ఆయా గ్రామాల్లో జరిగిన కార్యక్రమాల్లో సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు నియోజకవర్గం ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. మండలంలోని కొండాపురం గ్రామ పంచాయతీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి మాజీ మండల పరిషత్ అధ్యక్షురాలు బెల్లం ఉమ, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్ హాజరయ్యారు. నూతన పాలకవర్గ సభ్యులకు పుష్పగుచ్చాలు అందించి శాలువాలతో ఘనంగా సత్కరించారు. అదేవిధంగా ఆయా గ్రామాల్లో జరిగిన పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమాలలో బీఆర్ఎస్, సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Khammam Rural : ముగిసిన స్పెషలాఫీసర్ల పాలన.. కొలువుదీరిన గ్రామ పంచాయతీల నూతన పాలకవర్గాలు