అశ్వారావుపేట, డిసెంబర్ 22 : గ్రామ పంచాయతీల పోరు ముగిసింది. గెలుపొందిన పాలకవర్గాలు సోమవారం అట్టహాసంగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టాయి. ఇక ఆయా పంచాయతీ పరిధిలోని గ్రామాల అభ్యున్నతి, సమస్యల పరిష్కారం, ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన వంటి ప్రధాన నిర్ణయాల్లో సర్పంచ్‌లే సుప్రీంగా వ్యవహరించనున్నారు. పల్లెల ప్రగతి ఇక వీరి చేతుల్లోనే ఉండనుంది. గ్రామసభల తీర్మానాలే వారి శాసనాలు.
పంచాయతీరాజ్ వ్యవస్థలో 73వ రాజ్యాంగ సవరణ చట్టం ఐదంచెల విధానం అమల్లోకి తీసుకొచ్చింది. ఈ చట్టం గ్రామ పంచాయతీలకు విశేష అధికారాలు ఇచ్చింది. పంచాయతీల పాలనపై జిల్లా పంచాయతీ అధికారి పర్యవేక్షణ ఉంటుంది. ఒకవేళ పంచాయతీల్లో సర్పంచ్‌లు సక్రమంగా బాధ్యతలు నిర్వహించకుంటే చర్యలు తీసుకునే అధికారం జిల్లా కలెక్టర్‌కు ఉంటుంది.
గ్రామ పంచాయతీ కార్యాలయాలు పల్లెల్లో సమస్యల పరిష్కారానికి వేదికగా ఉంటాయి. గ్రామ పంచాయతీ సమావేశాల్లో సర్పంచ్ నేతృత్వంలో పాలకవర్గాలు తీసుకునే నిర్ణయాలు అత్యంత కీలకమవుతాయి. రోడ్లు, తాగునీటి సరఫరా, వీధిదీపాల ఏర్పాటు, పారిశుధ్య నిర్వహణతోపాటు ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన కోసం సమావేశాల్లో చర్చించి నిర్ణయం తీసుకుంటాయి. ప్రతి సమావేశానికి సర్పంచ్ అధ్యక్షత వహిస్తారు. గ్రామాభివృద్ధి కోసం చేపడుతున్న పనులు, భవిష్యత్‌లో చేపట్టబోయే పనులు, ఖర్చులు, ఆదాయ, వ్యయాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లేలా గ్రామసభలు నిర్వహిస్తాయి. గ్రామసభలో చేసే తీర్మానాలు గ్రామ చట్టాలుగా పరిగణిస్తాయి.