మండల కేంద్రానికి కూత వేటు దూరంలో ఉన్న కొత్తపల్లి, ద్వారకాపూర్, కిష్టంపేట గ్రామాలకు దశాబ్దాలుగా సరైన రోడ్డు వసతి లేదు. దీంతో గ్రామస్తులు అత్యవసర సమయంలో దవాఖాన, ఇతర అవసరాలకు వెళ్లాలన్నా కంకర రోడ్డే దిక్కు. ఇది వర్షాలకు గుంతలమయంగా మారడంతో ప్రయాణం నరకాన్ని తలపించేది. ఎన్నో ఏళ్ల నుంచి అభివృద్ధికి నోచుకోని మారుమూల గ్రామాల రహదారులకు మహర్దశ కలిగింది. ఎట్టకేలకు ఈ గ్రామాలకు బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రత్యేక చొరవతో మూడు గ్రామాల రహదారులు బీటీ రోడ్లుగా మారాయి. బీటీ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభమై పూర్తి కావడంతో ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.15 రోజుల్లో పనులు పూర్తి చేసేందుకుఅధికారులు కృషి చేశారు.
తాండూర్, ఫిబ్రవరి 26: మారుమూల గ్రా మాల్లో అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో రకాలుగా నిధులు విడుదల చేస్తున్నది. ప్రభుత్వ నిధులతో పాటు సింగరేణి సీఎస్ఆర్ నిధులతో ప్రభావిత గ్రామాల్లో పలు అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. గతంలో ఈ నిధులు నేరుగా సింగరేణి సంస్థ ఖర్చు చేసేది. అప్పుడు కేవలం కొన్ని గ్రామాల్లోనే అభివృద్ధి జరిగేది. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సీఎస్ఆర్ నిధుల ఖర్చును సంబంధింత ఎమ్మెల్యేలకు అప్పగించింది.
బెల్లంపల్లి నియోజకవర్గంలోని తాండూర్మండలానికి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో పెద్ద మొత్తంలో రూ. 1.80 కోట్లు విడుదల చేశారు. ఇందులో ద్వారకాపూర్ పంచాయతీకి రూ. 70 లక్షలు, కొత్తపల్లి పంచాయతీకి రూ. 70 లక్షలు, కిష్టంపేట పంచాయతీకి రూ. 40 లక్షల విడుదల చేశారు. ద్వారకాపూర్లో కాసిపేట అడ్డ రోడ్డు నుంచి గ్రామం వరకు, కొత్తపల్లిలో తాండూరు రోడ్డు నుంచి గ్రామం వరకు, కిష్టంపేట జాతీయ రహదారి నుంచి పంచాయతీ వరకు బీటీ రోడ్లు నిర్మించారు. ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న ఈ రోడ్లకు నిధులు మంజూరవడంతో పాటు పనులు కూడా పూర్తి చేయడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
హామీ నిలబెట్టుకున్న ఎమ్మెల్యే…
గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఈ నిధులు విడుదల చేసి మాట నిలబెట్టుకున్నారు. దశాబ్దాలుగా రోడ్లు లేక ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు ఆయనకు విన్నవించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే ఆ సమయంలో నిధులు మంజూరు చేయించి, రోడ్డు పనులు పూర్తి చేయించిన తర్వాతే కొత్తపల్లి, ద్వారకాపూర్ గ్రామాల్లో ఓట్లు అడగడానికి వస్తానని, అప్పటి దాకా ఎమ్మెల్యేగా ఓట్లు అడగను అని శపథం చేశారు. అన్నట్లుగానే మూడు గ్రామాలకు సీఎస్ఆర్ నిధులు మంజూరు చేసి బీటీ రోడ్డు పనులు పూర్తి చేశారు. దీంతో ఎన్నో ఏండ్లుగా గ్రామస్తులు పడుతున్న తిప్పలు తప్పాయి.
పనులు ప్రాంభించిన అధికారులు..
పంచాయతీరాజ్ శాఖ అధికారులు మూడు గ్రామాల పరిధిలో వేగవంతంగా బీటీ రోడ్ల పనులు దగ్గరుండి చేయించి పూర్తి చేశారు. ద్వారకాపూర్, కొత్తపల్లి, కిష్టంపేట గ్రామాల్లో బీటీ రోడ్డు పనులు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పర్యవేక్షణలో పనులు వేగవంతంగా పూర్తయ్యాయి.
ఎమ్మెల్యేకు రుణపడి ఉంటాం
ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు రుణపడి ఉంటాం. దశాబ్దాల సమస్యకు మోక్షం కలిగింది. ఈ రోడ్డు కోసం ఎన్నో ఏండ్లుగా ప్రజాప్రతినిధులు, ప్రజలు వినతులు సమర్పించినా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో నానా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ప్రజలు గ్రామానికి రావాలంటేనే ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. వర్షాకాలం వచ్చిందంటే అవస్థలు పడాల్సి వచ్చేది. బీటీ రోడ్డు పనులు వేగవంతంగా పూర్తి చేశారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య చొరవతోనే రోడ్డు మంజూరైంది. ఆయనకు గ్రామస్తుల తరపున కృతజ్ఞతలు.
– మాసాడి శారద, ద్వారకాపూర్ సర్పంచ్, తాండూర్
సమస్యలు తీరిపోయాయి…
ఊరు పుట్టినప్పటి నుంచి రోడ్డు ఇలాగే ఉంది. అయినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. అధికారులు, ప్రజాప్రతినిధులు మారారు. అయినా రోడ్డు రూపురేఖలు మారలేదు. వాహనాల మీద దేవుడెరుగు… కనీసం నడుచుకుంటూ పోయే పరిస్థితి కూడా ఉండేది కాదు. ఇప్పుడు రూ. 70 లక్షలతో బీటీ రోడ్డు ఏర్పాటు చేస్తామని అటు ఎమ్మెల్యే హామీ ఇవ్వడమే కాకుండా నిధులు మంజూరు చేయడంతో అధికారులు బీటీ రోడ్డు పనులను ప్రారంభించి పూర్తి చేయడం ఆనందంగా ఉంది.
మా గ్రామానికి మహర్దశ…
జాతీయ రహదారి పక్కనే ఉన్నా మా ఊరుకు రోడ్డు లేక ఇబ్బందులు పడ్డాం. ఈ నిధుల మంజూరై బీటీ రోడ్డు పనులు ప్రారంభమై రోడ్డు పనులు పూర్తయ్యాయి. ప్రజలకు తిప్పలు తప్పాయి. కిష్టంపేట చిన్న గ్రామ పంచాయతీ అయినా ఎమ్మెల్యే గ్రామ పంచాయతీపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎన్నో నిధులు విడుదల చేశారు. పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ రోడ్డు పనులు కూడా పూర్తవడం మాకు ఆనందంగా ఉంది. ఇప్పుడు మాకు ఇబ్బందులు తప్పుతాయి.