అశ్వారావుపేట, డిసెంబర్ 19 : గ్రామ పంచాయతీలకు కొత్తగా ఎన్నికైన సర్పంచ్లు, వార్డు సభ్యుల పదవీ కాలం లెక్కింపును ప్రమాణ స్వీకారం రోజు నుంచే ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకుంటుంది. ఆరోజు నుంచే సాంకేతికంగా పాలకవర్గాలు అధికారం పొందుతాయని తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం స్పష్టం చేస్తోంది. కౌంటింగ్ రోజు ఎన్నికల అధికారి ఇచ్చిన ధ్రువీకరణ కేవలం గెలుపును మాత్రమే సూచిస్తుంది తప్ప వెంటనే అధికారం రాదు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గ్రామ పంచాయతీల ఎన్నికలు మూడు విడతల్లో పూర్తయ్యాయి. కొత్తగా ఎన్నికైన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులు ఈ నెల 22న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
జిల్లాలో గ్రామ పంచాయతీల ఎన్నికల ప్రక్రియ బుధవారంతో పూర్తయింది. ఇక గెలుపొందిన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. ఇందుకోసం పంచాయతీ రాజ్ కమిషనర్ ఈ నెల 22న కొత్త పాలకవర్గాల ప్రమాణ స్వీకారం ఉంటుందని స్పష్టం చేశారు. ఈ నెల 11, 14, 17 తేదీల్లో మూడు విడతలుగా జరిగిన ఎన్నికల్లో అభ్యర్థులు విజయం సాధించినప్పటికీ వారికి సాంకేతికంగా అధికారం రాదు. ప్రమాణ స్వీకారాన్నే ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకుంటుంది. అప్పటి నుంచే వారి పదవీ కాలం లెక్కలోకి వస్తుంది.
గెలుపొందిన రోజు ఎన్నికల అధికారులు ఇచ్చే ధ్రువీకరణ కేవలం విజేతగా గుర్తింపును మాత్రమే సూచిస్తుంది. ఓట్ల లెక్కింపు రోజు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు గెలుపొందిన సర్పంచ్లు, వార్డు సభ్యులకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఈ పత్రాలు ఆయా అభ్యర్థులు గెలిచినట్లు గుర్తింపును సూచిస్తాయి. వీటితో సాంకేతికంగా అధికారం వారికి రాదు. అధికార బదిలీ కోసం తెలంగాణ ప్రభుత్వం పంచాయతీ రాజ్ చట్టంలో కొన్ని నిబంధనలను రూపొందించింది. ప్రమాణ స్వీకారానికి ముందు గెలుపొందిన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులకు సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ఎజెండాతో కూడిన రిజిస్టర్ను అధికారులు గెలుపొందిన వారి ఇంటికి పంపించి సంతకాలు తీసుకుంటారు.
పంచాయతీ కార్యాలయంలో పాలక మండలి ప్రమాణ స్వీకారం తర్వాత తొలి సమావేశం ఏర్పాటుపైనా ఎజెండా రిజిస్టర్లో పేర్కొంటారు. ప్రమాణ స్వీకారం రోజున ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రమాణ పత్రాన్ని గెలిచిన వారితో ప్రత్యేక అధికారి చేత చదివించి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అనంతరం సమావేశ హాజరు రిజిస్టర్లో సంతకం చేయించడం ద్వారా సాంకేతికంగా కొత్త పాలకవర్గాలకు అధికారం వస్తుంది. ఈ తర్వాత పాలకమండలి తొలి సమావేశంలో మినిట్స్ తీర్మానం రిజిస్టర్లో సంతకాలు చేస్తారు. ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు నుంచి సర్పంచ్, ఉప సర్పంచ్లకు జాయింట్ చెక్ పవర్ అందించేందుకు అధికారులు స్పెసిమెన్ (సంతకాలు) తీసుకొని ఎంపీడీవోకు, బ్యాంకుకు, ఎస్టీవోలకు అందించడంతో ఆర్థిక లావాదేవీలపై అజమాయిషీ పొందుతారు.
గ్రామ పంచాయతీలకు కొత్తగా ఎన్నికైన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతే అధికారికంగా పదవుల్లో ఉంటారు. ఆ రోజు నుంచే కొలువుదీరిన పాలకవర్గాల పదవీ కాలం లెక్కలోకి వస్తుంది. తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టంలో పొందుపరిచిన నిబంధనలకు అనుగుణంగా పాలక వర్గాలకు అధికారాలు బదిలీ అవుతాయి. ప్రమాణ స్వీకారోత్సవాలకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాం.
-అప్పారావు, ఎంపీడీవో, అశ్వారావుపేట