పాలేరు నియోజకవర్గంలో తొలి మున్సిపాలిటీ ప్రకటన కొద్దిరోజుల్లో వచ్చే అవకాశముంది. ఇందుకు సంబంధించిన మండల, జిల్లాస్థాయి ప్రక్రియ ముగిసింది. అయితే గతంలో అనుకున్నట్లుగా 10 పంచాయతీలు కాకుండా.. 12 పంచాయతీలు విలీనం కానున్నాయి. ప్రస్తుత మండల కేంద్రంగా ఉన్న పెద్దతండాకు బదులు ఏదులాపురం కేంద్రంగా మున్సిపాలిటీని ఖరారు చేస్తూ కలెక్టర్ ఆమోదం తెలిపారు. అధికారిక ఉత్తర్వుల నిమిత్తం రాష్ట్ర మున్సిపల్ శాఖకు నివేదికను పంపారు.
గతంలో పది పంచాయతీలే అనుకున్నప్పటికీ కొత్తగా బారుగూడెం, తెల్దారుపల్లి గ్రామాలనూ నూతన మున్సిపాలిటీ పరిధిలోకి తీసుకొస్తూ ముసాయిదా(డ్రాఫ్ట్)ను రూపొందించారు. వీటితోపాటు పల్లెగూడెం, పోలేపల్లి గ్రామాలకు సంబంధించిన కొన్ని కాలనీలు మాత్రమే నూతన మున్సిపాలిటీ పరిధిలోకి రానున్నాయి. తుది నివేదిక ప్రకారం.. బారుగూడెం, గొల్లగూడెం, గుదిమళ్ల, చిన్న వెంకటగిరి, ఏదులాపురం, గుర్రాలపాడు, మద్దులపల్లి, ముత్తగూడెం, పెద్దతండా, పోలేపల్లి (పార్టు), పల్లెగూడెం (పార్టు), తెల్దారుపల్లి గ్రామాలు ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోకి రానున్నాయి.
-ఖమ్మం రూరల్, సెప్టెంబర్ 27
పాలేరు నియోజకవర్గంలో ఏర్పడే తొలి మున్సిపాలిటీ ఏదులాపురమే కానుంది. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, వైరా, మధిర, సత్తుపల్లి నియోజకవర్గాల్లో మున్సిపాలిటీలు ఉన్నప్పటికీ కేవలం పాలేరులో మాత్రమే లేదు. ఇప్పుడు ఏదులాపురం మున్సిపాలిటీ అయితే పాలేరు నియోజకవర్గంలో తొలి మున్సిపాలిటీ అవుతుంది. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ మున్సిపాలిటీలు ఉన్నట్లవుతుంది. అయితే, ఏదులాపురం మున్సిపాలిటీతోపాటు మరికొద్ది రోజుల్లోనే ఎం.వెంకటాయపాలెం కేంద్రంగా మండలం అవతరించే అవకాశం కన్పిస్తోంది. ఇప్పటికే అక్కడ పోలీస్‌స్టేషన్ ఏర్పాటుకు సైతం ప్రతిపాదనలు వెళ్లాయి.
ఏదులాపురం కేంద్రంగా నూతన మున్సిపాలిటీ ఏర్పడితే అది జాతీయ రహదారుల కూడలిగా కూడా అవతరిస్తుంది. ఇప్పటికే ఖమ్మం రూరల్ మీదుగా కోదాడ-కురవి గ్రీన్‌ఫీల్డ్ హైవే, సూర్యాపేట-దేవరపల్లి హైవే, నాగ్‌పూర్-అమరావతి ఎక్స్‌ప్రెస్ హైవేలు వెళ్తున్న విషయం విదితమే. వీటి నిర్మాణాలు జోరుగా కొనసాగుతున్నాయి. కాగా, ఇప్పటికే డ్రాఫ్ట్ సిద్ధమై మున్సిపల్ శాఖ ఆమోదం కోసం వెళ్లిన తరుణంలో మున్సిపాలిటీ ఏర్పాటు ప్రకటన కూడా లాంఛనమయ్యే అవకాశం ఉంది.
నూతన మున్సిపాలిటీ ఏర్పాటైతే రాజకీయ ముఖచిత్రం మారడంతోపాటు అనేక కొత్త చిక్కులూ తలెత్తే అవకాశముంది. గతంలో పెద్దతండా, వెంకటగిరి, గుదిమళ్ల, ఏదులాపురం, గుర్రాలపాడు పంచాయతీలను కేఎంసీలో విలీనం చేసిన సమయంలో స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది.
తమవి పూర్తిగా గ్రామీణ ప్రాంతాలైనందున వీటిని కేఎంసీలో విలీనం చేస్తే ఉపాధిహామీ పథకానికి తాము దూరమవుతామని అప్పట్లో ఆయా గ్రామాల ప్రజలు వాపోవడంతో అప్పటి అధికారులు ఆయా గ్రామాలను విలీనం నుంచి తొలగించారు. మరిప్పుడు 12 పంచాయతీలు విలీనమైతే ఇప్పుడు కూడా ఆయా గ్రామాల ప్రజలు సదరు పథకానికి దూరమయ్యే అవకాశముంటుందని పలు పార్టీల నాయకులు పేర్కొంటున్నారు. కాగా, ప్రతిపాదిత మున్సిపాలిటీలో విలీనమయ్యే పంచాయతీలు ఒక్కో గ్రామం ఒక్కో పార్టీకి కంచుకోటగా ఉన్న విషయం విదితమే. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని సొంత గ్రామం కూడా విలీనమయ్యే అవకాశముంది.
పాలేరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఖమ్మం రూరలే అతిపెద్దది. తాజా గణాంకాల ప్రకారం మండల పరిధిలో 31 పంచాయతీలు ఉన్నాయి. గతంలో పెద్దతండా, ఏదులాపురం, గుర్రాలపాడు, గుదిమళ్ల, వెంకటగిరి గ్రామాలు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్(కేఎంసీ)లో విలీనం కావడంతో రఘునాథపాలెం మండలంలోని కామంచికల్, పడమటితండా, జాన్బాద్తండాలను ఖమ్మం రూరల్ మండలంలోకి తీసుకొచ్చారు. అనంతరం విలీన పంచాయతీల పరిధిలోని ప్రజల కోరిక మేరకు కార్పొరేషన్ నుంచి విడిపోయి తిరిగి ఖమ్మం రూరల్ మండలం పరిధిలోకి వచ్చాయి.
దీంతో ప్రస్తుతం 28 పంచాయతీలకు తోడు మరో మూడు పంచాయతీలైన పడమటితండా, కామంచికల్, దారేడు.. ఖమ్మం రూరల్ పరిధిలోకి వచ్చాయి. దీంతో లక్షమంది ఓటర్లకు పైబడిన మండలంగా ఖమ్మం రూరల్ అవతరించింది. అయితే మండల విస్తీర్ణం భారీగా పెరగడంతో మరో మండల కేంద్రం గానీ, విలీన పంచాయతీలతో కూడిన గ్రామాలను మున్సిపాలిటీగా గానీ ఏర్పాటు చేయాలని గత కేసీఆర్ ప్రభుత్వంలో చర్చ జరిగింది. దీంతో అప్పట్లోనే అధికారులు బైఫరికేషన్ ప్రక్రియతో కూడిన బ్లూప్రింట్‌ను కూడా సిద్ధం చేశారు. కానీ.. అప్పటికే ఎన్నికలు సమీపించడంతో ఆ ప్రతిపాదన ముందుకు సాగలేదు.