అన్నపురెడ్డిపల్లి, మే 31 : ఆయిల్‌పాం సాగుకు మండలంలోని నేలలు అనుకూలంగా ఉన్నందున సాగుతో రైతులు నికర ఆదాయం పొందవచ్చని జిల్లా ఉద్యాన శాఖ అధికారి సూర్యనారాయణ అన్నారు. శుక్రవారం తాటి బుచ్చన్నగూడెం గ్రామంలో ఆయిల్‌పాం తోటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వమే ఆయిల్‌పాం మొక్కలు, డ్రిప్‌ను సబ్సిడీపై అందిస్తుందని తెలిపారు. ఆయిల్‌పాం సాగులో అంతర పంటలు వేసి అదనంగా ఆదాయం పొందవచ్చన్నారు. పంటకు కోతుల బెడద, ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడల బాధలు ఉండవన్నారు. మొక్కలకు తప్పనిసరిగా బోరాన్, మెగ్నీషియం అధికారుల సూచన మేరకు వినియోగించాలన్నారు. నీటిని, ఎరువులను డ్రిప్ పద్ధతిలో సులభతరంగా అందించవచ్చన్నారు. ఆయిల్‌పాం సాగు కోసం రైతులకు అందిస్తున్న సబ్సిడీని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో హెచ్‌వో శాంతిప్రియ, ఉద్యాన శాఖ, గోద్రెజ్ కంపెనీ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.