మధిర, ఏప్రిల్ 23 : మానవ సృష్టి మనుగడ ఆడబిడ్డలతోనే సాధ్యం అవుతుందని, ఆడబిడ్డ ఇంటికి అదృష్టంగా భావించాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. బుధవారం మండలంలోని దెందుకూరు గ్రామంలో మా పాప- మా ఇంటి మణిదీపం కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని ఎస్.కె సుహనా, సమీర్ దంపతులకు ఆడపిల్ల జన్మించిన విషయం తెలిసి, వారి ఇంటికి కలెక్టర్ వెళ్లి పాప తల్లిదండ్రులతో పాటు అత్తా, మామలను కలిసి స్వీట్ బాక్స్, పండ్లు, సర్టిఫికెట్ అందించి శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆడబిడ్డ కుటుంబానికి అమ్మగా ఉంటుందని, అన్ని బంధాలకు మాతృప్రేమ పంచేవారని అన్నారు. సమాజంలో అమ్మాయి పుడితే అదృష్టంగా భావించాలన్నారు. ఆడబిడ్డలను ఎవరికి తక్కువకాకుండా పెంచాలని, మనం ఆశించే మార్పు మన ఇంటి నుండే ప్రారంభించాలని తెలిపారు. మహాలక్ష్మి ఇంట్లో పుట్టినందుకు శుభాకాంక్షలు తెలుపాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి కె.రాంగోపాల్ రెడ్డి, సిపిఓ ఏ.శ్రీనివాస్, తాసీల్దార్ రాంబాబు, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Madhira : ఆడ బిడ్డలతోనే సృష్టి మనుగడ : కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్