విహార యాత్రికులకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మంచి విడిదిగా మారింది. కొత్తగూడెం అర్బన్(సెంట్రల్) పార్కు, కిన్నెరసాని, భద్రాచలం, పర్ణశాల, బొగత జలపాతం, గుబ్బలమంగి, పెద్దమ్మతల్లి, సమ్మక్క-సారలమ్మ తదితర పర్యాటక ప్రాంతాలు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. మరోవైపు విద్యార్థుల పిక్నిక్ స్పాట్లకూ కొదువలేదు.
కొత్తగూడెం మొదలు వాజేడు వరకు ఉన్న పర్యాటక ప్రాంతాలు ప్రతి ఏడాది చలికాలం ప్రకృతి ప్రేమికులకు వరంగా మారాయి. అంతేకాక ఆంధ్రాలో కలిసిన మన పాపికొండల లాంచీ ప్రయాణం పర్యాటకుల మనసు దోచుకుంటున్నది. నిత్యం బిజీ లైఫ్ బతుకులు మనవి. కనీసం పిల్లలతో గడిపే తీరికలేని రోజులివి. మనసు పులకరించే ప్రదేశాలను చూసి.. ఆ ఆహ్లాదాన్ని కుటుంబంతో పంచుకోవాలంటే మాత్రం భద్రాద్రి జిల్లాలోని ప్రకృతి అందాలను చూసి తీరాల్సిందే.
– భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ)
కార్తీకమాసం వచ్చిందంటే చాలు పర్యాటకులు ప్రకృతి వైపు పరుగులు పెడతారు. అలాంటి సుందర దృశ్యాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అనువుగా ఉంది. గత కేసీఆర్ ప్రభుత్వం పర్యాటకానికి ప్రత్యేక నిధులు విడుదల చేసి ప్రకృతి ప్రేమికుల మనసు దోచుకునేలా ఆయా ప్రాంతాలను అభివృద్ధి చేసింది. ఆ పర్యాటక ప్రాంతాలు నేడు మనసును దోచుకుంటున్నాయి. నీటి ప్రవాహంలో సెలయేటి పరవళ్లు.. పక్కనే ప్రకృతి అందాలు.. కొండకోనలు.. చెట్టుచాటున కనబడే అడవి జంతువుల అందాలు చూస్తుంటే ఎవరికైనా మనసు పులకించక మానదు. ఒకటికాదు.. రెండు కాదు ఎన్నో అపురూప దృశ్యాలు మన కళ్లకు కనబడి చిటుక్కున మాయమయ్యే విచిత్ర ఘటనలు.. ఆ మధుర క్షణాలు తీపి గురుతులుగా మిగిలిపోతున్నాయి.
విహారయాత్రలకు వెళ్లే కార్తీకమాసం రానే వచ్చేసింది. కొంతమంది ప్రాచీన ఆలయాల దర్శనాలు, తీర్థయాత్రలకు వెళ్తుంటే మరికొంతమంది పర్యాటక ప్రాంతాల్లో విహారం చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం అర్బన్(సెంట్రల్) పార్కు, కిన్నెరసాని, భద్రాచలం, పర్ణశాల, బొగత జలపాతం, గుబ్బలమంగి, పెద్దమ్మతల్లి, సమ్మక్క-సారలమ్మ తదితర ప్రాంతాలకు వెళ్లి ఆహ్లాదాన్ని పంచుకుంటున్నారు. మరికొంతమంది విద్యార్థులు పిక్నిక్ స్పాట్లకు వెళ్తున్నారు.
అన్ని ప్రాంతాల్లో నదులు, వాగులు ఉండడం అరుదు. నీటిలో బోటు షికారు చేస్తే ఎంతో ఆనందంగా ఉంటుంది. అలాంటి బోటు షికారు కొత్తగూడెం నియోజకవర్గంలోని కిన్నెరసాని ప్రాంతంలో ఉంది. డ్యాంలో జోరున పారే నీటి సెలయేరు పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచుతున్నది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న పాపికొండల్లో గోదావరి నదిలో లాంచీ ప్రయాణం పర్యాటకులను అబ్బురపరుస్తున్నది. పాపికొండల్లో విహారం ఎంతో ఆనందానిస్తుంది.
వెదురుతో చేసిన బొమ్మలు, పూల మందిరాలు, కొండకోనల అందాలు ప్రకృతి ప్రేమికుల మనస్సును పులకింపజేస్తాయి. కొత్తగూడెం జిల్లాకేంద్రంలో సెంట్రల్ పార్కులో పర్యాటకులు సందడి చేస్తున్నారు. సెలవులు, ఆదివారాలు వస్తే పిల్లాపాపలతో అర్బన్‌పార్కుకు వచ్చి ఆటవిడుపుగా ఎంజాయ్ చేస్తున్నారు. గత ఏడాది ప్రారంభించిన ఈ సెంట్రల్ పార్కు ప్రస్తుతం కొత్త అందాలతో రూపుదిద్దుకుంది. పాపికొండల విహారయాత్రకు ప్రత్యేక ప్యాకేజీ కూడా అందుబాటులో ఉంది. కిన్నెరసాని టూరిజంపై కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ప్రత్యేక శ్రద్ధ చూపడంతో పుట్టిని కూడా ఏర్పాటు చేశారు. దీంతో పర్యాటకులు కిన్నెరసానిలో సందడి చేస్తున్నారు.
అరుణాచలం అనగానే తమిళనాడులో అతిపెద్ద శివాలయం గుర్తుకు వస్తుంది. ఇప్పుడు అలాంటి అరుణాచలం శివయ్య మన భద్రాచలం డివిజన్లోని దుమ్ముగూడెం మండలంలో కూడా ఉన్నాడు. చిన్న అరుణాచలం భక్తులకు కొంగుబంగారంగా మారింది. అక్కడ ఉన్న లింగాల మాదిరిగానే ఇక్కడ కూడా ఏర్పాటు చేసి పెద్ద శివాలయాన్ని నిర్మాణం చేయడంతో భక్తులు చిన్న అరుణాచలం వద్ద శివుడిని దర్శించుకుంటున్నారు.
గత కేసీఆర్ ప్రభుత్వం పర్యాటక రంగానికి పెద్దపీట వేసింది. జిల్లా కేంద్రంలో సకల సౌకర్యాలతో ఏర్పాటు చేస్తున్న బడ్జెట్ హోటల్‌తోపాటు కిన్నెరసానిలో అద్దాల మేడకు రూ.12 కోట్ల నిధులు మంజూరు చేసింది. మరో ఆరు నెలల్లో పనులు పూర్తికానున్నాయి. బడ్జెట్ హోటల్ పూర్తయితే పర్యాటకుల తాకిడి జిల్లా కేంద్రానికి ఎక్కువగానే ఉండనున్నది. అతి విశాలమైన గదులతో బడ్జెట్ హోటల్ నిర్మాణం జరుగుతున్నది.
పాపికొండల నడుమ సాగే లాంచీ ప్రయాణం భలే సరదాగా ఉంటుంది. ఉదయం 9 గంటలకు బయలు దేరే లాంచీలు సాయంత్రానికి తీరానికి వస్తాయి. తర్వాత పర్ణశాల, భద్రాచలంలో విడిది చేసేందుకు వసతి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు.
కొత్తగూడెం : సెంట్రల్ పార్క్, సింగభూపాలెం, కిన్నెరసాని బోటింగ్, అద్దాలమేడ, జింకలపార్కు
బూర్గంపాడు : వేలేరు వద్ద పాములేరు
భద్రాచలం : భద్రాచలం కరకట్ట, పర్ణశాల, గుబ్బలమంగి, దుమ్ముగూడెం ప్రాజెక్టు, చర్లలో తాలిపేరు
దుమ్ముగూడెం : చిన్న అరుణాచలం ఆలయం
ఇల్లెందు : ఏడుపాయలవాగు, వాటర్‌పాల్స్
అశ్వారావుపేట : మూకమామిడి, దమ్మపేట పామాయిల్ తోటలు, చండ్రుగొండలో వెంగళరావు ప్రాజెక్టు, గుబ్బల మంగమ్మ తల్లి ఆలయం
మణుగూరు : సమ్మక్క-సారలమ్మ గద్దెలు, వాటర్‌పాల్స్, అశ్వాపురం భారజల ప్లాంటు
వాజేడు : బొగత జలపాతం
కార్తీకమాసంలో విహారయాత్ర చాలా ఎంజాయ్‌గా ఉంటుంది. ప్రతిసారి ట్రిప్‌కు వెళ్తున్నాం. లాంచీ ప్రయాణం చాలా బాగుంది. కుటుంబ సమేతంగా వెళ్తున్నాం. భద్రాచలం ఆలయం, పర్ణశాల, బొగత జలపాతాలు బాగున్నాయి. మళ్లీ చూడాలనిపిస్తున్నది. ప్రకృతి రమణీయతను ఆస్వాదించాల్సిందే. చాలా ఎంజాయ్ ట్రిప్ మాది. చిన్న అరుణాచలం సైతం చాలా బాగుంది.
– సృజన, హైదరాబాద్
కార్తీకమాసం వచ్చిందంటే మా ప్రాంతానికి పండుగే. పర్యాటకులు బాగా వస్తుంటారు. రామాయణ చరిత్ర ఇక్కడే ఉంది. సీతమ్మ నారచీరెలు, రాముడుసీతమ్మ పాదాలు ఇక్కడ ఉన్నాయి. కుటీరం కూడా ఉంది. ప్రతిఒక్కరూ భద్రాచలం వచ్చాక ఇక్కడకు రావాల్సిందే. గోదావరి తీరం చాలా బాగుంటుంది. పర్యాటకులు చాలా ఆనందంగా గడుపుతున్నారు.
– ద్రాక్షాయిని, పర్ణశాల, వ్యాపారి