మధిర, మార్చి 8: ప్రజలు శాంతి సామరస్యాలతో జీవనం సాగించాలని మధిర సివిల్ మెజిస్ట్రేట్ రాళ్ల బండి శాంతి లత అన్నారు. శనివారం మధిర కోర్టులో జాతీయ మెగా లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా మధిర మేజిస్ట్రేట్ రాళ్లబండి శాంతి లత మాట్లాడుతూ… క్షణికావేశంలో చేసిన నేరాలను సామరస్యంగా మాట్లాడుకుని, లోక్ అదాలత్లో రాజీ పడవచ్చునని పేర్కొన్నారు. పంతాలు, పట్టింపులతో వ్యయ ప్రయాసలకు గురి కావాల్సి వస్తుందన్నారు. కనుక ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా ఆలోచించి ముందుకు సాగినప్పుడు ఎటువంటి వివాదాలకు దారి తీసే అవకాశం ఉండదన్నారు.
మహిళలు అన్ని రంగాలలో బహుముఖంగా రాణిస్తున్నారని రాళ్లబండి శాంతి లత అన్నారు. స్త్రీ తనకు ఇచ్చిన స్వేచ్చను దుర్వినియోగం చేయకూడదని పేర్కొన్నారు. సమాజం పట్ల బాధ్యతాయుతంగా మెలిగి మరింత రాణించాలని ఆకాంక్షించారు. అనంతరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మధిర బార్ అసొసియేషన్, కోర్టు సిబ్బంది మహిళా న్యాయమూర్తిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, కోర్టు కానిస్టేబుల్స్, పారా లీగల్ వాలంటీర్లు పాల్గొన్నారు.