కొత్తగూడెం సింగరేణి, జూన్ 17 : సింగరేణి సంస్థ ఉద్యోగుల సమాచారానికి, సేవలకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని విస్తృతంగా వాడుతున్నందుకు గుర్తింపుగా కంప్యూటర్ ఎక్స్ప్రెస్ అనే సంస్థ జాతీయ స్థాయిలో అత్యుత్తమ ఐటీ సేవల కంపెనీగా సింగరేణికి అవార్డును అందజేసింది. ఆదివారం రాత్రి జైపూర్లో జరిగిన జాతీయస్థాయి సమావేశంలో ఈ అవార్డును సింగరేణి సంస్థకు ప్రదానం చేశారు. సోమవారం ఉదయం సింగరేణి భవన్లో జీఎం కో ఆర్డినేషన్ దేవేందర్ నేతృత్వంలో ప్రాజెక్టు మేనేజర్ ఐటీ హరప్రసాద్, ఐటీ డిప్యూటీ జీఎంలు హరిశంకర్, హరిప్రసాద్, మేనేజర్ ఐటీ రామలక్ష్మయ్య ఈ పురస్కారాన్ని సీఎండీకి అందించారు. ఉద్యోగుల సమస్త సమాచారం, ప్రమోషన్లు తదితర అన్ని విషయాలను ఎంప్లాయి సర్వివల్ ఇన్ఫర్మేషన్ సిస్టం ద్వారా పొందుతున్నందుకు ఈ జాతీయస్థాయి సమావేశంలో ప్రత్యేక ప్రశంస లభించింది. సింగరేణి సంస్థ ఎస్ఏపీని అమలు జరిపిన దేశంలోని మొట్టమొదటి బొగ్గు ఉత్పాదన కంపెనీగా కూడా ఇప్పటికే గుర్తింపు తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో ఉద్యోగుల సమాచారాన్ని డిజిటలైజ్ చేస్తున్నందుకు మరో అవార్డు లభించడం పట్ల సంస్థ సీఎండీ బలరాం తన అభినందనలు తెలిపారు.