ఖమ్మం, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తన హయాంలోనే పాలేరు నియోజకవర్గ అభివృద్ధి జరిగిందని, ఆ అభివృద్ధే ఎన్నికల్లో గెలిపిస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కందాళ ఉపేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన ఎన్నికల ప్రచారం, తన విజయావకాశాలపై ‘నమస్తే’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. నియోజకవర్గ సమస్యలపై స్థానికుడిగా తనకు పూర్తి అవగాహన ఉందని, లభించిన ప్రతి అవకాశాన్ని శాసనసభ్యుడిగా సద్వినియోగం చేసుకుని ప్రజలకు మంచి చేశానన్నారు. నియోజకవర్గంలో బీఆర్ఎస్కు ఎదురులేదని, ఎన్నికల్లో గెలుపు తనదేనన్నారు. కొందరు ప్రజల్లో గందరగోళం సృష్టిస్తూ గప్పాలు కొడుతున్నారని మండిపడ్డారు. పాలేరు బిడ్డగా ప్రజలకు సేవ చేస్తూనే ఉంటానని, కష్టం వస్తే ప్రజలు నేరుగా తన వద్దకు వస్తారన్నారు.
ఐదేళ్లలో ఎవరికి ఏ కష్టం వచ్చినా స్పందించానని, అందరి సమస్యలు పరిష్కరించానన్నారు. ఎవరు నా నంబర్‌కు కాల్ చేసినా స్పందించే మనస్తత్వం తనదన్నారు. ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకున్నానని, ఇక ముందు కూడా ఇలాగే ఉంటానన్నారు. ప్రత్యర్థుల ప్రచార ఆర్భాటాలు తన విజయాన్ని అడ్డుకోలేవని ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గానికి జేఎన్టీయూ, నర్సింగ్ కళాశాలలను తీసుకొచ్చానన్నారు. మళ్లీ ఎన్నికల్లో గెలిచాక నియోజకవర్గానికి వ్యవసాయ అనుబంధ పరిశ్రమ తెచ్చేందుకు కృషి చేస్తానన్నారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకుని సీతారామ ప్రాజెక్టు నిర్మిస్తున్నారని, ప్రాజెక్ట్ పూర్తయితే నియోజకవర్గం సస్యశ్యామలమవుతుందన్నారు. తాను రాజకీయాలకు అతీతంగా ప్రజలకు సేవ చేస్తున్నానని, ప్రజలే తనను ఎన్నికల్లో గెలిపించుకుంటారన్నారు.