కారేపల్లి(ఖమ్మం), నవంబర్ 9: ప్రతి సమస్యలను పాలకులు, ప్రజా ప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండటమే కాకుండా ప్రజాసేవలో సైతం తమ వంతు కృషి చేస్తున్న నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే దినపత్రికల సేవ ప్రశంసనీయమని ఖమ్మం కార్పొరేషన్ చైర్మన్ పూనకొల్లు నీరజ కొనియాడారు. నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే, టీవీ పార్టనర్ టీ న్యూస్, డిజిటల్ పార్ట్నర్ సుమన్ టీవీల సంయుక్త ఆధ్వర్యంలో ఖమ్మం పట్టణంలో రెండు రోజులపాటు నిర్వహించిన ఆటో షో ఆదివారంతో ముగిసింది.
స్థానిక ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ పీజీ కళాశాల మైదానంలో గల ఆటో షో ప్రాంగణంలో జరిగిన ముగింపు వేడుకకు మేయర్ నీరజ హాజరై మాట్లాడుతూ.. అన్ని రకాల కార్లు, మోటార్ సైకిల్ కంపెనీలను ఒకే వేదికకు చేర్చడంతో పాటు వివిధ రకాల బ్యాంకర్లను కూడా అందుబాటులో ఉంచటం అభినందనీయమన్నారు. వాహన ప్రియులు తమకు నచ్చిన కంపెనీల ఇష్టమైన వాహనాలను కొనుగోలు చేసేందుకు కుటుంబ సమేతంగా తరలివచ్చి ఈ ఆటో షోను సద్వినియోగం చేసుకునే అవకాశాన్ని నమస్తే తెలంగాణ కల్పించడం సంతోషకరంగా ఉందన్నారు. గతంలో కూడా నమస్తే తెలంగాణ ఆధ్వర్యంలో ప్రాపర్టీ షో, ఆటో షోలు నిర్వహించి ప్రజల నుంచి మంచి ఆదరణ పొంది మన్ననలు పొందారని గుర్తుచేశారు. అంతకుముందు లక్కీ డ్రాప్ ద్వారా ఎంపికైన విజేతకు బహుమతిని అందజేశారు. ఈ ఆటో షోలో పాల్గొన్న కంపెనీల ప్రతినిధులకు మెమొంటోలు ఇచ్చారు. అనంతరం స్కోడా కార్, మోటార్ సైకిల్ కొనుగోలు చేసిన యజమానులకు తాళాలు అందజేసి అభినందించారు.

Namasthe Telangana Autoshw2
ఖమ్మం పట్టణంలో రెండు రోజులపాటు నిర్వహించిన ఈ ఆటో షోకు ప్రజల నుంచి విశేష స్పందన లభించడంతో పట్ల నిర్వాహకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో నమస్తే తెలంగాణ ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో చీఫ్ మాటేటి వేణుగోపాల్, బ్రాంచ్ మేనేజర్ రేనా రమేశ్, అడ్వర్టైజ్మెంట్ మేనేజర్ బోయిన శేఖర్ బాబు, సర్కులేషన్ మేనేజర్ కె. రాంబాబు, నమస్తే తెలంగాణ పాత్రికేయులు, అడ్వర్టైజ్మెంట్, సర్కులేషన్, బ్రాంచ్ కార్యాలయ సిబ్బందితోపాటు వివిధ కంపెనీల ప్రతినిధులు, బ్యాంకర్స్, సందర్శకులు తదితరులు పాల్గొన్నారు.