ఖమ్మం: నాగుల చవితి పండుగను సోమవారం ఖమ్మం అర్బన్, రఘునాథపాలెం మండలాల ప్రజలు భక్తిశ్రద్దలతో జరుపుకున్నారు. కార్తీక మాసం తొలి సోమవారం నాగుల చవితి పర్వదినం రావడంతో ఆలయాల వద్ద భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా మండలంలోని ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. శివాలయాలు శివనామస్మరణతో మారుమ్రోగాయి. భక్తులు ఆలయాల్లో ఉన్న పుట్టలకు పాలు పోసి మొక్కులు మొక్కుకున్నారు. శ్రీ పాండురంగాపురంలో శ్రీ రామలింగేశ్వర ఆలయంలో తెల్లవారుజాము నుంచే భక్తులతో రద్దీగా కన్పించింది. ఆలయ అర్చకులు అంబడిపూడి రవికుమార్ శర్మ ప్రత్యేక అభిషేకాలు చేశారు.
ఆలయ కమిటీ చైర్మన్ గాజుల వీరభద్రయ్య, ప్రధాన కార్యదర్శి కొట్నాల ఉపేంద్రాచారి, తీగల వెంకటేశ్వర్లు, చిలుకోటి వెంకటసుబ్బారావు, మోరం వీరన్న, పంపుల శ్రీనివాసరావులు పాల్గొని భక్తులకు సౌకర్యాలు కల్పించారు. రఘునాథపాలెంలోని పురాతన శివాలయంలో భక్తులు కిక్కిరిసి కన్పించారు. ఇల్లెందు రోడ్డు రఘునాథపాలెం వద్ద నాగేద్రమ్మ తల్లి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయం వద్ద ప్రసాదాలు నైవేద్యంగా సమర్పించారు. ఖానాపురం శ్రీ అభయ వెంకటేశ్వర స్వామి ఆలయంలోని పుట్ట వద్ద మహిళలు, అయ్యప్ప భక్తులు భారీగా తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు.