కూసుమంచి, డిసెంబర్ 7 : నాగార్జున సాగర్ నుంచి ఆదివారం విడుదల చేసిన 4,500 క్యూసెక్కుల నీరు పాలేరు రిజర్వాయర్‌కు బుధవారం చేరింది. ఖమ్మం జిల్లాలోని బోనకల్ మెయిన్ బ్రాంచ్ కెనాల్ కింద ఇంకా వరినాట్లు పూర్తికాకపోవడం, పాలేరు రిజర్వాయర్ నీటిమట్టం 15అడుగులకు పడిపోవడంతో సాగు, తాగునీటి అవసరాల కోసం మరో 2.5 టీఎంసీల నీటిని అదనంగా కేటాయించారు.
సాగర్ నుంచి రోజుకు 4,500 క్యూసెక్కుల వంతున వారంరోజుల పాటు నీటిని పాలేరుకు వదులుతున్నారు. ఆదివారం వదిలిన నీరు బుధవారం నాటికి పాలేరుకు చేరింది. ఈ నీటితో మిషన్ భగీరథ కింద ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలకు తాగునీటి ఇబ్బంది కూడా తొలగిపోనున్నది. ఈ నెల 15వ తేదీ నుంచి యాసంగికి వారబందీ పద్ధతిలో వచ్చే ఏప్రిల్ 23వ తేదీ వరకు నీటిని విడుదల చేయనున్నారు.