దమ్మపేట రూరల్, ఆగస్టు 11: ఆంధ్రా సరిహద్దులో ‘జై తెలంగాణ’ అని నినదించిన వీరవనిత తూతా నాగమణి. భద్రాద్రి జిల్లా దమ్మపేట మండలం వడ్లగూడెం ఆమె స్వగ్రామం. ఈ గ్రామం ఆంధ్రాలోని సీతానగరం గ్రామానికి కేవలం అర కిలోమీటరు మాత్రమే. తెలంగాణ మలిదశ ఉద్యమ కార్యకలాపాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అంతంతమాత్రంగా సాగుతున్న రోజుల్లో మహిళ అయినప్పటికీ ఉద్యమంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపులన్నింటినీ పుణికిపుచ్చుకుంది. అనేకసార్లు పోలీసులు అరెస్టులు చేసినా వెనకడుగు వేయకుండా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే వరకు కేసీఆర్ వెన్నెంటే ఉంది.
ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటూ కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావు, మధుసూదనాచారి వంటి అగ్రనాయకుల నాయకత్వంలో ‘జై తెలంగాణ’ నినాదాన్ని వినిపించింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్.. ఉద్యమ సమయంలోనూ, ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా లక్షల మందిలో ఉన్నా ‘అక్కా’ అంటూ పిలిచేంత అనుబంధం నాగమణి సొంతం చేసుకుంది. నాగమణి ఎప్పుడూ ఏ పదవీ కోరకపోయినా కేసీఆర్ స్వయంగా ఆమెను ఉమ్మడి ఖమ్మం జిల్లా స్త్రీ, శిశు సంక్షేమశాఖ కో ఆర్డినేటర్‌గా నియమించారు. ఆ హోదాకు ఆమె పూర్తిస్థాయిలో పనిచేసి తన స్థాయిని మరింత పెంపొందించుకున్నారు.
నాగమణి మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అగ్రనేతలు హరీశ్‌రావు, మధుసూదనాచారీలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒక మంచి యోధురాలిని బీఆర్ఎస్ కోల్పోయిందంటూ కేసీఆర్ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. పార్టీకి ఆమె చేసిన సేవలను, ఉద్యమ కృషిని స్మరించుకున్నారు.
నాగమణి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని భద్రాద్రి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దిండిగల రాజేందర్‌తో బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్లో మాట్లాడి తెలిపారు. పార్టీ స్థాపన నుంచి తెలంగాణ ఉద్యమం, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పని చేశారని, మంచి నాయకురాలు లేకపోవడం చాలా బాధాకర విషయమని పేర్కొన్నారు. నాగమణి మృతి పట్ల రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర; ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు కూడా వేర్వేరు ప్రకటనల్లో సంతాపం వ్యక్తంచేశారు. కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.