ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా సోమవారం రంజాన్ వేడుకలను ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. భక్తిశ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లింలతో ఈద్గాలు, మసీదులు కిటకిటలాడాయి. ఒకరినొకరు ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మతపెద్దలు మాట్లాడుతూ అల్లా కరుణ అందరిపై ఉంటుందని, ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలని కోరుకున్నారు. ఆయా చోట్ల ప్రార్థనల్లో ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, ప్రముఖులు పాల్గొని మాట్లాడుతూ మత సామరస్యం, సర్వమానవ సమానత్వం, కరుణ, దాతృత్వానికి ఈద్-ఉల్-ఫితర్ ప్రతీకగా నిలిచిందన్నారు.
ఈ పవిత్ర రంజాన్ మాసం సమాజంలో ప్రేమ, శాంతి, ఐక్యతను చాటిచెబుతుందన్నారు. ఖమ్మం నగరంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, కూసుమంచిలో మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి, మణుగూరులో బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, కొత్తగూడెంలో మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, ఇల్లెందులో మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్, సత్తుపల్లిలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, మధిరలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తదితరులు పాల్గొని ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. – నమస్తే నెట్వర్క్