ఖమ్మం, జూన్ 17 : త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్ పండుగను ఉమ్మడి జిల్లాలోని ముస్లింలు సోమవారం అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఉదయం 6:45 గంటల నుంచి 8:30 వరకు మసీదులు, ఈద్గాహ్ల వద్ద వేలాది మంది ముస్లింలు ‘ఈద్ ఉల్ అజ్ హా’ ప్రత్యేక నమాజును ఆచరించారు. జిల్లాలోని ఖమ్మం, సత్తుపల్లి, మధిర, వైరా, పాలేరుల్లోని ఈద్గాహ్లు కిక్కిరిసి కన్పించాయి. అనంతరం త్యాగానికి ప్రతిరూపమైన బక్రీద్ పండుగలో భాగంగా ‘ఖుర్బానీ’ చేశారు. నమాజు అనంతరం తమ తాహతకు తగ్గట్లుగా గొర్రెల వంటి వాటిని ఖుర్బానీ చేసి ఆ మాంసాన్ని పంచిపెట్టారు. ఖమ్మం నగరంలోని గొల్లగూడెం ఈద్గాహ్ వద్ద ముస్లింలు ఒకరినొకరు ఆలింగనం చేసుకొని పరస్ఫరం బక్రీద్ శుభాకాంక్షలు చెప్పుకున్నారు.
వివిధ రకాల మాంసాన్ని మూడు భాగాలుగా చేశారు. ఒక భాగాన్ని పేదలకు, మరో భాగాన్ని బంధువులకు, ఇంకో భాగాన్ని తమ ఇంటికి వినియోగానికి ఉపయోగించుకున్నారు. కాగా, ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగలలో రంజాన్ తరువాత మరో ముఖ్యమైన పండుగ బక్రీద్. ఇబ్రహీం అలైహిస్సలాం, ఆయన కుమారుడు ఇస్మాయిల్ అలైహిస్సలాంల త్యాగాన్ని స్మరించుకుంటూ ఈ పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ముస్లిం ప్రవక్తలు అల్లాహ్ సందేశం వినిపించారు. బక్రీద్ పండుగ పేరు ఈద్ ఉల్ అజ్ హా అని పేర్కొనబడిందని, ఖుర్బానీ అంటే సమర్పణ, త్యాగం, బలి అనే అర్థాలు ఉన్నాయని వివరించారు.
జిల్లాలోని ఆయా ఈద్గాహ్ల్లో ప్రత్యేక నమాజులు ఆచరిస్తున్న ముస్లింల వద్దకు పలువురు ప్రముఖులు వెళ్లి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్తగూడెంలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఇల్లెందులో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దిండిగాల రాజేందర్ తదితరులు ఈద్గాహ్ల వద్ద ముస్లింలను ఆలింగనం చేసుకొని విషెస్ చెప్పారు. బక్రీద్ ప్రత్యేకత గురించి వివరించుకున్నారు.