ఖమ్మం రూరల్, జనవరి 18 : పన్నెండు పంచాయతీలను ఏకం చేసి ఏదులాపురం పేరుతో మున్సిపాలిటీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గెజిట్‌ను శుక్రవారం విడుదల చేసింది. ఇందుకు సంబంధించి బ్లూప్రింట్‌ను ప్రభుత్వం ఆమోదం కోసం కలెక్టర్ కార్యాలయానికి పంపించింది. ప్రస్తుతానికి మండలంలో 31 గ్రామపంచాయతీలు ఉండగా.. మరో నాలుగు పంచాయతీల ఏర్పాటుకు కొద్ది రోజుల్లోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
దీంతో మొత్తంగా 35 పంచాయతీలు కాబోతుండగా.. వీటిలో నుంచి పన్నెండు పంచాయతీలు అనగా.. ఏదులాపురం, గొల్లగూడెం, బారుగూడెం, గుదిమళ్ల, చిన్న వెంకటగిరి, గుర్రాలపాడు, మద్దులపల్లి, ముత్తగూడెం, పెద్దతండా, పోలెపల్లి, రెడ్డిపల్లి, పల్లెగూడెం(పార్టు), తెల్దారుపల్లి ఇక నుంచి ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోకి రానున్నాయి. దీంతో మరో 23 గ్రామాలతో నేడో రేపో యం వెంకటాయపాలెం కేంద్రంగా నూతన మండలం అవతరించే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి నూతన పోలీస్‌స్టేషన్ ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి.