అశ్వారావుపేట, జనవరి 12 : మున్సిపల్ అధికారుల బాధ్యతారాహిత్యం కారణంగా ఓటర్లు గందరగోళ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఎన్నికల అధికారులు ఇటీవల విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితాలోనూ, సోమవారం విడుదల చేసిన తుది జాబితాలోనూ ఎక్కువగా తప్పులు దొర్లడంతో పార్టీల నేతలు, ఆశావహులు, ఓటర్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అయోమయానికి గురవుతున్నారు. ఒక వ్యక్తి అనేక వార్డుల్లో ఓటరుగా దర్శనమిస్తుండడం, మృతుల పేర్లు కూడా ఓటర్ల జాబితాలో ఉండడం వంటి వాటిపై అభ్యంతరం తెలుపుతున్నారు. అలాగే.. ఇంటి పేరు లేకుండా కొందరు ఓటర్ల పేర్లు, అసంపూర్తి వివరాలతో మరికొందరు ఓటర్ల పేర్లు జాబితా నిండా ఉన్నాయి. కనీసం సవరించకుండానే ఎన్నికల అధికారులు ఈ జాబితాలను విడుదల చేయడం పట్ల పట్టణ ఓటర్లు, ఆశావహులు, నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
కొద్ది రోజుల కిత్రం మున్సిపల్ అధికారులు విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితా అంతా తప్పుల తడకగా ఉంది. సోమవారం విడుదల చేసిన తుది జాబితా కూడా ఇంచుమించు ఇదేవిధంగా ఉంది. కొన్నేళ్ల క్రితం మృతిచెందిన ఓటర్లకు కూడా జాబితాలో చోటు కల్పించారు. ఒక వార్డులో ఉన్న ఓటర్లకు మరో వార్డులోనూ ఓట్లు ఉన్నాయి. గత అసెంబ్లీ ఓటర్ల జాబితాను కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలో వార్డులుగా విభజించి ఈ నెల 1న ముసాయిదా ఓటర్ల జాబితాగా అధికారులు ప్రకటించారు. దీనిలో పోలింగ్ కేంద్రాల వారీగా అనేక తప్పులు చోటుచేసుకున్నాయి. వీటిని గమనిస్తున్న స్థానికులు.. అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మృతిచెందిన ఓటర్ల పేర్లను తొలగించకపోవడం, ఒక వార్డులో ఉన్న ఓటర్ల పేర్లు మరో వార్డులో ఉన్నప్పటికీ వాటిని తొలగించకపోవడం వంటి అంశాలపై పెదవి విరుస్తున్నారు.
అశ్వారావుపేట మున్సిపాలిటీలో మొత్తం 22 వార్డులుండగా.. వాటిలో మొత్తం 16,850 మంది ఓటర్లు ఉన్నారు. ఒక వార్డుల్లోని ఓటర్ల పేర్లు మరో వార్డుకు, ఇంకో పోలింగ్ కేంద్రంలోని ఓటర్లు మరో పోలింగ్ కేంద్రంలోకి మారిపోయాయి. వార్డులు, పోలింగ్ బూత్‌లలో పేర్లు మారిపోవడంతో తమ ఓటు ఎక్కడుందో తెలుసుకునేందుకు ఓటర్లు మున్సిపల్ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
ఫలితంగా ముసాయిదా ఓటర్ల జాబితాపై అధిక సంఖ్యలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఒక వార్డులో ఓటర్లు మరో వార్డులోకి వెళ్లడం, ఒక ఓటరుకు రెండు, మూడు వార్డుల్లో ఓటు హక్కు ఉండడం వంటివి ఈ జాబితాలోని లోపాలను ఎత్తిచూపుతున్నాయి. గ్రామాల్లోని ఓటర్లు, మృతుల ఓట్లు కూడా పట్టణ ఓటర్ల జాబితాలో దర్శనమివ్వడం చర్చనీయాంశంగా మారింది. ఓట్లే కాకుండా పోలింగ్ కేంద్రాలు సైతం మారిపోవడంపై ఓటర్లు పెదవి విరుస్తున్నారు. కొన్ని అభ్యంతరాలను సవరించిన అధికారులు.. మిగతా జాబితాలో పెద్దగా మార్పులు లేకుండానే తుది జాబితా విడుదల చేశారు.
ముసాయిదా ఓటర్ల జాబితాల్లో అనేక లోపాలు బహిర్గతం కావడంపై రాజకీయ పార్టీల నాయకులు కూడా మండిపడ్డారు. ‘సాంకేతిక లోపమా? లేదా అధికారుల నిర్లక్ష్యమా?’ అంటూ నిలదీశారు. నిర్ణీత గడువు ఇవ్వకుండా ఎన్నికల సంఘం కూడా హడావిడిగా ముసాయిదా ఓటర్ల జాబితాను, అభ్యంతరాలను పూర్తిగా పరిష్కరించకుండా తుది జాబితాను విడుదల చేయడం సరికాదంటూ నాయకులు, ఆశావహులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామంటూ ఎన్నికల సంఘం చెబుతుందే తప్ప కచ్చితమైన ఓటర్ల జాబితా ప్రకటించడంలో కనీస బాధ్యత తీసుకోవడం లేదన్న ప్రశ్నలు ఓటర్ల నుంచి వ్యక్తమవుతున్నాయి.
అధికారులు తొలుత ప్రకటించిన ముసాయిదా ఓటర్ల జాబితాలో అనేక లోపాలు స్పష్టంగా కనిపించాయి. ఉదాహరణకు కొన్నింటిని పరిశీలిస్తే.. 17వ వార్డులో సీరియల్ నంబర్ 112 ఓటరు దోమల పుష్పరాజు సుమారు ఏడాది క్రితం మృతిచెందాడు. అలాగే, సీరియల్ నంబర్ 415లో కర్రి అనసూయ 4 ఏళ్ల క్రితం మృతిచెందింది. 16వ వార్డులోని సీనియల్ నంబర్ 115లో జల్లిపల్లి మల్లికార్జునరావు 4 నెలల క్రితం మరణించాడు. 14వ వార్డులోని సీరియర్ నంబర్ 150లోని చెలమయ్య, సీరియల్ నంబర్ 162లోని కృష్ణ, 5వ వార్డులోని సీరియల్ నంబర్ 312లో గుడివాడ స్వరాజ్యం వంటి వారు కూడా మృతిచెందారు. అయినా, వీరి పేర్లు ముసాయిదా జాబితాలో ఉన్నాయి. తుది జాబితాలోనూ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ విధంగానే స్థానిక లక్కీ అపార్ట్మెంట్ ఏరియాలో ఉన్న కొందరు ఓటర్లకు మైసమ్మ గుడి ఏరియాలోనూ ఓట్లు ఉన్నాయి. ఇలా ప్రతి వార్డులోనూ ఏదో ఒక లోపం ఉంది. తుది జాబితా కూడా ఇంచుమించు ఇలాగే ఉంది.
కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లో ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లను ఇతర డివిజన్ల జాబితాలో చేర్చారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని తుమ్మలనగర్ ప్రాంతం ఖాళీ అయినప్పటికీ అక్కడ ఓటర్లను అదే డివిజన్లో ఉంచారు. వేరే గ్రామాల్లో ఉన్న ఓటర్లను సైతం కార్పొరేషన్ పరిధిలోనే నమోదు చేసుకున్నారు. గ్రామాల్లో ఉన్న ఓటర్లను తొలగించాలని దరఖాస్తు చేసుకున్నప్పటికీ అధికారులు వాటిని తొలగించలేదు.
ఇల్లెందు, జనవరి 12: ఇల్లెందు మున్సిపాలిటీ ఓటర్ల ముసాయిదా, తుది జాబితాలపై కూడా ఓటర్లు గందరగోళంలో ఉన్నారు. ఇల్లెందు మున్సిపాలిటీలో ఈ నెల 1న ముసాయిదా జాబితాను, సోమవారం తుది జాబితాను అధికారులు ప్రకటించారు. ఈ జాబితాల ప్రకారం మొత్తం 24 వార్డులు ఉన్నాయి. వాటిల్లో మొత్తం 33,777 మంది ఓటర్లు ఉన్నారు. తమ పేర్లు, తమ కుటుంబ సభ్యుల పేర్లు పరిశీలించుకుందామని జాబితాలను చూసిన పట్టణ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఒకే ఇంటి నంబరులోని ఇంట్లో ఒక కుటుంబంలో నలుగురు ఓటర్లుంటే.. అందులో ఇద్దరి ఓట్లు ఒక వార్డులో, మరో ఇద్దరి ఓట్లు మరో వార్డులో నమోదై ఉన్నాయి. ఇంకా చాలా వరకూ మరణించిన వారి పేర్లు జాబితాలో ఉన్నాయి.
రెండో వార్డులో 6-2-143 ఇంటి నంబర్లో కొండూరి వీరస్వామి, కొండూరి పుల్లమ్మ అనే వారు మరణించి ఏడాదిన్నర, ఏడాది అవుతోంది. అదే ప్రాంతానికి చెందిన కొండూరి మంగతాయారు, కొండూరి రవి, గోనెల సిద్ధయ్య అనేవారు మరణించి కూడా చాలా కాలమవుతోంది. అయినప్పటికీ వారి పేర్లను అధికారులు ముసాయిదా జాబితాలో తొలగించలేదు. ఒకటో వార్డులో మరణించిన అక్కి పుల్లయ్య, బొల్ల వెంకటనారాయణ పేర్లూ జాబితాలో అలాగే ఉన్నాయి. మున్సిపాలిటీలో ప్రతి వార్డులోనూ సుమారు పది మంది వరకూ మరణించిన వారి పేర్లు జాబితాలో నమోదై ఉండడం గమనార్హం. అలాగే, మున్సిపాలిటీ పరిధిలో 1వ వార్డుకు చెందిన 120 మంది ఓట్లు 2వ వార్డు ఓటరు జాబితాలో ఉండడం గమనార్హం.
మున్సిపల్ అధికారులు విడుదల చేసిన ముసాయిదా, తుది ఓటర్ల జాబితాలో అనేక లోపాలు ఉన్నాయి. వీటిలో కొన్నింటిని గుర్తించి వాట్సప్ ద్వారా అధికారులకు అభ్యంతరంతో కూడిన ఫిర్యాదు చేశాం. ఓటర్ల జాబితాలో గందరగోళంగా లేకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి.
-బత్తిన పార్థసారథి, సొసైటీ మాజీ డైరెక్టర్, అశ్వారావుపేట
ఓట్ల నమోదు, తొలగింపు వంటివి మా పరిధిలో ఉండవు. రెవెన్యూ శాఖ నుంచి తీసుకున్న జాబితాలోంచి వార్డుల వారీగా ఓటర్లను సర్దుబాటు చేస్తాం. మృతిచెందిన, అభ్యంతరాలు వ్యక్తమైన, ఇతర కారణాలున్న ఓటర్లను గుర్తించి ఏసీడీ (ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెత్) జాబితాను తయారు చేసి ఈఆర్వోలకు అందజేస్తాం. పోలింగ్ సమయంలో ఈఆర్వోలు ఏసీడీ జాబితాను సరి చూసుకుంటారు.
-బీ.నాగరాజు, మున్సిపల్ కమిషనర్, అశ్వారావుపేట