‘తెలంగాణలో పుట్టి.. పూల పల్లకి ఎక్కి.. లోకమంతా తిరిగేవటే..’ అంటూ ఉమ్మడి జిల్లా ఆడబిడ్డలందరూ అంగరంగ వైభవంగా బతుకమ్మలు ఆడుతున్నారు. తెలంగాణ పూల పండుగ ఉమ్మడి జిల్లాలో ఘనంగా కొనసాగుతోంది. ఊరూవాడా ఏకమైన ఆడబ్డిడలందరూ శుక్రవారం మూడోరోజు ముద్దపప్పు బతుకమ్మలతో మురిసిపోయారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ అధికారికంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఖమ్మం కలెక్టరేట్లో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ముద్దపప్పు బతుకమ్మ వేడుకలను నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టరేట్లోని వివిధ శాఖల అధికారులు, సిబ్బంది బతుకమ్మలను పేర్చారు. పాలు, చకెర, పెసలు, సత్తుపిండి, బెల్లం తదితరాలతో నైవేద్యం సమర్పించారు. పెద్ద ఎత్తున ఉద్యోగులు, మహిళలు వేడుకల్లో పాల్గొని గౌరమ్మను పూజించారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ ఉత్సాహంగా వేడుకలు జరుగుతున్నాయి. మహిళలు, యువతులు, విద్యార్థినులు పెద్ద సంఖ్యలో భారీ బతుకమ్మలను ఎత్తుకొని వస్తున్నారు. రాత్రి పొద్దుపోయే వరకూ బతుకమ్మలను ఆడి సమీప జలాశయాల్లో వాటిని నిమజ్జనం చేస్తున్నారు.
-ఖమ్మం, అక్టోబర్ 4