ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది స్థానాల్లో విజయం సాధించి సీఎం కేసీఆర్కు కానుకగా అందిస్తామని ఎంపీలు నామా నాగేశ్వరరావు, బండి పార్థసారథిరెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. జిల్లా నుంచి ఎవరినీ అసెంబ్లీ గేటు తాకనివ్వనంటూ మాజీ ఎంపీ పొంగులేటి వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందని, అవకాశవాద రాజకీయలు చేసేవారికి రానున్న ఎన్నికల్లో ప్రజలే గుణపాఠం చెబుతారని అన్నారు. సత్తుపల్లిలోని 23 వార్డుల బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం తుమ్మూరు రామారావు వీధిలో మంగళవారం జరిగింది.
పార్టీ కార్యకర్తలు, పథకాల లబ్ధిదారులు, ప్రజలు భారీగా తరలివచ్చారు. ముందుగా అతిథులందరూ మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ‘ఒకప్పుడు రాముడైన సీఎం కేసీఆర్.. ఈ రోజు నిన్ను బహిష్కరించే సరికి రావణుడయ్యారా?’ అంటూ నిలదీశారు. ‘సొంత పార్టీకి ద్రోహం చేసిన వ్యక్తిగా పొంగులేటి చరిత్రలో నిలిచిపోతారని ఎద్దేవా చేశారు. నీ పొలాలకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత కరెంటు రావడం లేదా? రైతుబంధు తీసుకోవడం లేదా? అని ప్రశ్నించారు.
– సత్తుపల్లి టౌన్, ఏప్రిల్ 11
సత్తుపల్లి టౌన్, ఏప్రిల్ 11 : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది స్థానాలు గెలుస్తామని, కేసీఆర్కు కానుకగా అందిస్తామనిగ వక్తలు స్పష్టం చేశారు. కేసీఆరే తెలంగాణ జాతిపిత అని, రాష్ర్టాన్ని ఆయన ఎలా తీర్చిదిద్దారో దేశమంతటికీ తెలుసునని స్పష్టం చేశారు. సత్తుపల్లిలోని 23 వార్డుల బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం పట్టణంలోని తుమ్మూరు రామారావు వీధిలో మంగళవారం జరిగింది. పార్టీ కార్యకర్తలు, పథకాల లబ్ధిదారులు, ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ముందుగా అతిథులందరూ మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహనికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. అనతికాలంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన అభివృద్ధి గురించి ఇతర రాష్ర్టాల్లోనేగాక ఇతర దేశాల్లోనూ చర్చ జరుగుతోందని అన్నారు. కొందరు స్వార్థపరులు సీఎం కేసీఆర్ను అనవసరంగా విమర్శిస్తున్నారని దుయ్యబట్టారు. అలాంటి వారందరూ ముందుగా ఆయన చేసిన అభివృద్ధిని చూడాలని హితవు చెప్పారు.
అప్పుడు రాముడు.. ఇప్పుడు రావణుడా? : వద్దిరాజు
‘ఒకప్పుడు రాముడైన సీఎం కేసీఆర్.. ఈ రోజు నిన్ను బహిష్కరించే సరికి రావణుడయ్యారా?’ అంటూ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర.. మాజీ ఎంపీ పొంగులేటిని ప్రశ్నించారు. ఇలాంటి సంబోధనలను తెలంగాణ ప్రజలు సహించబోరని, తగిన గుణపాఠం చెబుతారని స్పష్టం చేశారు. ‘నువ్వు కోరుకున్న చోట సీటు ఇవ్వలేదని, నువ్వు చెప్పిన వారికి అసెంబ్లీ టికెట్లు ఇవ్వలేదని పార్టీ అభ్యర్థులను ఓడించినందునే ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్ను పక్కన పెట్టారు.’ అని అన్నారు. ‘సొంత పార్టీకి ద్రోహం చేసిన నీకు పార్టీలో కొనసాగే అర్హత ఎలా ఉంటుంది.’ అని ప్రశ్నించారు. నారాయణపురంలో నీ పొలాలకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత కరెంటు రావడం లేదా? రైతుబంధు రావడం లేదా? అని ప్రశ్నించారు.
రూ.20 కోట్ల విలువైన భూమి రాయించుకున్నావ్ : కూరాకుల
2014 ఎన్నికల్లో తనను అభ్యర్థిగా నిలిపిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. కనీసం ప్రచారానికి రాకుండా ద్రోహం చేశాడని డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం విమర్శించారు. వైసీపీ నుంచి ఖమ్మం అభ్యర్థిగా తనను పోటీలోకి దింపి తన దగ్గర నుంచి ఖమ్మంలోని రూ.20 కోట్ల విలువైన 5100 గజాల భూమిని రాయించుకున్నాడని అన్నారు. పైగా తన తరఫున ప్రచారానికి రాకుండా తనను నడి రోడ్డుపై వదిలేశాడని విమర్శించారు. ఇలాంటి వారిని నమ్ముకున్న నాయకులు అధోగతి పాలవుతారని అన్నారు. పొంగులేటి వంటి స్వార్థపూరిత నాయకుల విషయంలో జిల్లా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అన్నారు.
ఐదేళ్లు ఎంపీగా ఉండి తట్టెడు మట్టీ పోయలేదు : ఎమ్మెల్సీ మధు
ఐదేళ్లు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న పొంగులేటి ఆ సమయంలో జిల్లాలో గానీ, సత్తుపల్లి నియోజకవర్గంలో గానీ అభివృద్ధి పనుల కోసం తట్టెడు మట్టి కూడా పోయలేదని విమర్శించారు. పార్లమెంట్లో ఒక్కసారైనా జిల్లా గురించి గానీ, నియోజకవర్గం గురించి గానీ మాట్లాడారా? అని ప్రశ్నించారు. రాబోయే నాలుగు నెలల కాలంలో ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త వార్డుల్లో, గ్రామాల్లో ప్రజలను కలిసి ప్రభుత్వ పథకాల గురించి వివరించాలని కోరారు. పథకాల లబ్ధిదారులను చైతన్యం చేయాలని సూచించారు. రాబోయే ఎన్నికల కురుక్షేత్ర యుద్ధానికి ఈ ఆత్మీయ సమ్మేళనాలే సన్నాహక సమావేశాలని అన్నారు.
కేసీఆర్ రూపొందించిన పథకాలు ఆదర్శనీయం : ఎంపీ నామా
సీఎం కేసీఆర్ రూపొందించి అమలు చేస్తున్న పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న ఖమ్మం పార్లమెంటు స్థానం పరిధిలో ప్రైవేటు డబ్బుతో ఏర్పాటు చేస్తున్న నేషనల్ హైవేకు ఇటీవల ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారని, మరి ఆ శంకుస్థాపన విషయంపై తనకు ఆహ్వానం పంపాలన్న జ్ఞానం కూడా ప్రధానికి లేదని విమర్శించారు. కేంద్రానికి అత్యధిక పన్నులు తెలంగాణ నుంచే వెళ్తున్నాయని, కానీ అక్కడికి రావాల్సిన నిధులు మాత్రం అత్యల్పంగా వస్తున్నాయని అన్నారు. ఖమ్మం నుంచి ఎవరినీ అసెంబ్లీ గేటు తాకనివ్వబోనని బీఆర్ఎస్ బహిష్కృత నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించడం జిల్లా ప్రజలను అవమానించడమేనని అన్నారు. ఆయనలాంటి అవకాశవాదులకు రాబోయే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. పదికి పది స్థానాలూ గెలిచి సీఎం కేసీఆర్కు కానుకగా ఇస్తామన్నారు.
అభివృద్ధి ఫలాలే మా కరపత్రాలు : ఎమ్మెల్యే సండ్ర
సీఎం కేసీఆర్ అందించిన అభివృద్ధి ఫలాలే తమ కరపత్రాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. ఆ అభివృద్ధి, సంక్షేమ పథకాలు, వాటి ఫలాలను కరపత్రాలుగా ముద్రించి ప్రజలకు అందిస్తున్నామని అన్నారు. సీఎం కేసీఆర్ను ఎవరైనా విమర్శించే ముందు ఆయన చేసిన అభివృద్ధిని చూడాలని హితవు చెప్పారు. జిల్లాలో ఆత్మీయ సమ్మేళనాల పేరిట ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించుకుంటూ వెళ్తున్న పొంగులేటి.. ఓసీ, జనరల్ స్థానాల్లో ఎందుకు ప్రకటించడంలేదని ప్రశ్నించారు. జెండా, అజెండా లేకుండా కార్యకర్తలను మభ్యపెడుతున్న పొంగులేటికి రాబోయే ఎన్నికల్లో జిల్లా ప్రజలే బుద్ధిచెబుతారని అన్నారు. విమర్శలు చేసే ముందు సత్తుపల్లి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూడాలని చురకలంటించారు. ఈ సారి ఉమ్మడి జిల్లాలో పది స్థానాలనూ బీఆర్ఎస్ కైవసం చేసుకోవడం తథ్యమని అన్నారు.
తారతమ్యం లేకుండా రాష్ట్ర అభివృద్ధి : బండి పార్థసారథిరెడ్డి
రాష్ట్రంలో కులమతాల తారతమ్యం లేకుండా అభివృద్ధి జరుగుతోందని రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్డి పేర్కొన్నారు. అదే విధంగా ఆత్మీయ సమ్మేళనాలూ పండుగలా జరుగుతున్నాయని అన్నారు. వీటి ద్వారా ప్రభుత్వ పథకాల గురించి అందరికీ తెలిసేలా వివరించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. 30 ఏళ్ల క్రితం తాను సత్తుపల్లిలో చదువుకునే రోజుల్లో సత్తుపల్లి పట్టణం ఇరువైపులా కాంక్రీట్ భవనాలే కనిపించేవి కాదని గుర్తుచేశారు. తెలంగాణ సాధించుకున్న తర్వాత సత్తుపల్లి పట్టణం చూడముచ్చటగా కన్పిస్తోందని అన్నారు. తెలంగాణలో ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందాయని, వాటిని పొందిన లబ్ధిదారులంతా 40 రోజుల పాటు పండుగలా జరుపుకునే కార్యక్రమాలు ఈ ఆత్మీయ సమ్మేళనాలని అన్నారు.