కారేపల్లి, ఏప్రిల్ 4: ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలో (Singareni) ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు మండల పంచాయతీ అధికారి మల్లెల రవీంద్ర ప్రసాద్ తెలిపారు. మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఆయన నమస్తే తెలంగాణతో మాట్లాడుతూ పట్టణ కేంద్రంలోని బీసీ కాలనీకి ఇటీవల మిషన్ భగీరథ నీటి సరఫరా సక్రమంగా కాకపోవడంతో రూ.40 వేల వ్యయంతో కొత్తగా పైప్లైన్ వేసి ఇంటింటికి కుళాయిల ద్వారా నీళ్లను సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా గ్రామాలలో నీటి సరఫరాకు అనివార్య కారణాలవల్ల అంతరాయం కలిగితే 24 గంటల్లో పునరుద్ధరిస్తున్నట్లు పేర్కొన్నారు.
మిషన్ భగీరథ నీటి సరఫరా పైపుల లీకేజీ పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని పంచాయతీ అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. గ్రామ పంచాయతీల ద్వారా ఇంటింటికి తాగునీళ్లను సరఫరా చేసేందుకు కోటిన్నర ఖర్చు అవుతుందని, దానికి సంబంధించిన నిధులను విడుదల చేయాలని కోరుతూ ఎమ్మెల్యేకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. మాదారం, రేగులగూడెం గ్రామ పంచాయతీలలో బోర్లు మరమత్తులకు గురికావడంతో వెంటనే రిపేర్ చేపించాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించామన్నారు. ఎర్రబోడ్ గ్రామంలో ఉన్న ట్యాంకుకు నీళ్లు ఎక్కకపోవడంతో నేరుగా పైప్ లైన్ నుంచి నల్లాల ద్వారా ఇంటింటికీ సరఫరా చేపిస్తున్నామని తెలిపారు. మండలంలో తాగునీటి కొరత ఉన్న చోట 15 బోర్లు మంజూరు చేయాలని ఎమ్మెల్యేను కోరగా సానుకూలంగా స్పందించినట్లు వెల్లడించారు. గ్రామాలలో తాగునీటి సరఫరాలో ఎటువంటి అసౌకర్యం కలిగిన ప్రజలు వెంటనే పంచాయతీ అధికారులకు సమాచారం అందించాలని కోరారు.